ద క్వీన్స్ గ్యాంబిట్ – రివ్యూ మరియు కొన్ని ఆసక్తికర విషయాలు
ద క్వీన్స్ గ్యాంబిట్ – 1983 లో వాల్టర్ టెవిస్ వ్రాసిన ఈ నవలా డ్రామా అదే పేరుతో నెట్ ఫ్లిక్స్ లో ఈ అక్టోబరు 23 న విడుదలయి నెంబర్ 1 సిరీస్ గా ప్రపంచవ్యాప్తం గా ప్రశంసలందుకొంటుంది. స్కాట్ ఫ్రాంక్ మరియు అలన్ స్కాట్ డెవెలప్ చేసిన ఈ మినీ సిరీస్ బెత్ హార్మన్ అనే కల్పిత బాల మేధావి అయిన ఒక అమ్మాయి పాత్ర చదరంగ సామ్రాజ్యాన్ని, చదరంగం లోని మహామహులను ఎలా ఢీ కొట్టిందో మరియు తన చెడు అలవాట్లను ఎలా జయించిందనే అంశాలతో కూడుకొని ఉంటుంది.
అన్యా టేలర్ – జాయ్ ప్రధాన పాత్ర పోషించగా, బిల్ కాంప్ బెత్ హార్మన్ కి చదరంగాన్ని పరిచయం చేసిన జానీటర్ అయినటువంటి షయ్బెల్ గా, హ్యారీ మెల్లింగ్ బెల్టిక్ గా, థామస్ బ్రాడీ బెన్నీ వాట్స్ గా, మారసిన్ డోరోసిన్స్కి వాసిలీ బోర్గోవ్ గా మరియు జాకబ్ ఫార్చ్యూన్ టౌనెస్ వంటి ముఖ్య పాత్రలు రక్తి కట్టించారు.
కథాంశం: 1950 లలో తన తల్లిని కోల్పోయి అనాథ ఆశ్రమానికి చేరిన బెత్ హార్మన్ అనే బాలిక ఆ ఆశ్రమం బేస్ మెంట్ లో చదరంగం ఆడే జానీటర్ శైబెల్ వద్ద చదరంగం ఆట రూల్స్ నేర్చుకొని కొన్ని రోజుల్లోనే బాల చదరంగ మేధావి గా నిరూపించుకుంటుంది. అయితే ఈ క్రమం లో ఆశ్రమం లో ఇచ్చే మత్తు బిళ్ళ లకు బానిస అయి అది తన చదరంగానికి ఉపయోగించుకొని మహామహులను ఓడించడం మొదలుపెడుతుంది. కానీ ఆ అడిక్షన్ ను, తన ఎమోషన్స్ పై కంట్రోల్ కోల్పోతూ, తల్లిని కోల్పోయి మరొక వైపు ఇంటిని తన సొంతం చేసుకోవడానికి డబ్బులు ఖర్చుపెట్టి మాస్కో లో చదరంగం పోటీ లకు డబ్బు లేక పోవడం తో తాను ఎలా పోటీలకు వెళ్ళింది, తన ప్రత్యర్థులైన బెన్నీ వాట్సన్ మరియు బోర్గోవ్ లను ఎలా ఓడించింది అనేది కథాంశం.
గమనించాల్సిన విషయాలు:
నటీనటుల అద్భుత ప్రదర్శన: అన్యా టేలర్ పోషించిన బెత్ హార్మన్ పాత్ర అన్యా టేలర్ కెరీర్ లోనే ఉత్తమ ప్రదర్శన గా చెప్పవచ్చు. ముఖ్యం గా ఒంటరితనం మరియు సెలబ్రిటీ హోదాల మధ్య నలిగిపోతూ, దగ్గరయిన వారందరినీ దూరం చేసుకుంటూ తన ప్రత్యర్థి బోర్గోవ్ ని ఓడించడానికి తాను పడే మానసిక వేదన, ముఖ్యం గా చదరంగం ఆడేటప్పుడు టేలర్ చూపించే హావ భావాలు వెలకట్టలేనివి.
లోపభూయిష్టమయిన వ్యక్తిత్వం తో విజయం మరియు దాని వల్ల కలిగే మత్తు మరియు అడిక్షన్ కి బానిసయ్యే ద్వంద్వత్వం తో కూడిన పాత్ర పోషించడం కత్తి మీద సవాలు వంటిదే. అయితే దాన్ని సులువుగా పోషించింది అన్యా టేలర్. ముఖ్యం గా బెత్ హార్మన్ పాత్ర ని మలచిన తీరు అభినందనీయం. దీనితో పాటు బెత్ పాత్ర వివిధ సమయాల్లో తను సాధించే పరిపక్వత ఆధారం గా టేలర్ వస్త్ర ధారణ, దుస్తులు మరియు కేశాలంకరణ వంటి చిన్న చిన్న అంశాలను కూడా ఎంతో శ్రధ్ధ గా మలచిన తీరు ప్రశంసనీయం.
అన్యా టేలర్ తో పాటు మిగతా పాత్రలు పోషించిన వారు కూడా తమ తమ పాత్ర లకు పూర్తి న్యాయం చేశారని చెప్పవచ్చు.
She gives you this look… what do you do? pic.twitter.com/IcoxA5EIdG
— Netflix (@netflix) October 28, 2020
ప్రొడక్షన్ విలువలు:
1960 లలోని అమెరికా, మెక్సికో, పారిస్ మరియు మాస్కో ని చూపించిన తీరు, ఉన్నతమయిన సాంకేతిక విలువలు, వస్త్రాలంకరణ, ఆ కాలం నాటి వాహానాలు మరియు భవనాల వంటివాటి విషయం లో తీసుకున్న శ్రద్ధ ఈ సిరీస్ ప్రొడక్షన్ ని నెట్ ఫ్లిక్స్ ఎంత ముఖ్యమైన ప్రాజెక్ట్ గా పరిగణించిందో చెప్పవచ్చు. ఉన్నతమయిన ప్రొడక్షన్ ఈ సిరీస్ ని మరింత అందం గా, ఉన్నతం గా తెరపై చూపించిందని చెప్పవచ్చు.
The Queen’s Gambit on @Netflix is spectacular from start to finish. If it were a film rather than a limited series I would consider it a sure bet for Oscar contention, if not for the win. Amazing work by all involved. Well done and thank you! pic.twitter.com/atHyW3Ov31
— Jason Ragosta (@JasonRagosta) October 25, 2020
అద్భుతమయిన సినిమాటోగ్రఫీ:
ద క్వీన్స్ ఆఫ్ గ్యాంబిట్ యొక్క మరొక బలం అద్భుతమయిన సినిమాటోగ్రఫీ.. చాలా సన్నివేశాల్లో సినిమాటోగ్రఫీ బెత్ పాత్ర కు చదరంగం తో ఉన్న అనుబంధాన్ని బలపరిచే విధం గా చూపించబడింది. ఒకానొక సన్నివేశం లో బెత్ పారిస్ లో పోటీ పడే ముందు ఒక హాలులోని చెస్ బోర్డ్ ముందు కూర్చుని ఉన్న బెత్ ని దగ్గరగా చూపిస్తూ మెల్లగా కెమెరా వైడ్ అవుతూ అరవైల నాటి పారిస్ ఫర్నీచర్స్ ని, అలంకరణ లను మరియు చెస్ బోర్డ్స్ ని చూపిస్తూ ఆ హాలు అందాన్ని, ఖాళీ గా ఉన్న ఆ హాలు ని బెత్ పాత్ర తో పోలుస్తూ చూపించే విధానం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే..
1960 ల నాటి కలర్ ప్యాలెట్ ని, టోన్స్ ని ప్రతిఫలిస్తూ జాగ్రత్తగా కంపోజ్ చేయబడ్డ షాట్స్, అక్కడక్కడా ఉపయోగించే డార్క్ కలర్స్ మరియు మూడ్ ని బట్టి మారే కలర్ టోన్, ముఖ్యం గా సీలింగ్ పై డార్క్ బ్లూ కలర్ ని ఉపయోగించి చూపించబడే చెస్ సీజీ షాట్స్ కెమెరా పనితనాన్ని మరియు దర్శకుడు స్కాట్ ఫ్రాంక్ కెమెరా ని కథ కు ఉపయోగించుకున్న తీరు అతనికున్న అనుభవాన్ని తెలియచేస్తుంది. ముఖ్యం గా
క్లైమాక్స్ లో చూపించే కెమెరా షాట్స్ (పోటీ సమయం లో) అందుకు ఉపయోగించిన లైటింగ్ మరియు డార్క్ టోన్స్ మరియు కాంట్రాస్ట్ అప్పటి మాస్కో ని చూపిస్తూనే కంపోజిషన్ యొక్క గొప్పతనాన్ని కళ్ళముందుంచుతుంది.
I’ve watched a lot of TV during this cursed year–I know I’m not alone–and the best of the best is THE QUEEN’S GAMBIT, on Netflix. Utterly thrilling. I thought nothing would beat THE TRIAL OF THE CHICAGO SEVEN, but this does.
— Stephen King (@StephenKing) October 28, 2020
బెస్ట్ అడాప్టేషన్:
ఈ మినీ సిరీస్ వాల్టర్ టెవిస్ యొక్క అదే పేరుతో కూడిన నవల “ద క్వీన్స్ గ్యాంబిట్” ఆధారంగా తెరకెక్కించారు. వాల్టర్ టెవిస్ స్వతహాగా చెస్ ప్లేయర్. చాలా టోర్నమెంట్లలో ఆడిన అనుభవం ఉన్నవాడు. ఈ నవల కొరకు చాలా మంది చెస్ గ్రాండ్ మాస్టర్లను కలిసి వారి అనుభవాలను మరియు తనకున్న జ్ఞానాన్ని క్రోడీకరించి వ్రాసుకున్నాడు ఈ కథని. ఈ కథ లో ఉపయోగించిన చెస్ మెలకువలన్నీ ఏదోకసారి చెస్ గ్రాండ్ మాస్టర్స్ తమ పోటీల్లో ఉపయోగించినవే కావడం గమనార్హం. నవల ను తెర పై తీసుకు వచ్చేటపుడు దర్శకుడు కొంత స్వతంత్రం గా వ్యవహరిస్తారు. చాలా కొద్దిమంది మాత్రమే ఒరిజినల్ కథ పై తమకున్న నమ్మకాన్ని అదేవిధం గా తెర పై చూపించడానికి ప్రయత్నిస్తారు. స్కాట్ ఫ్రాంక్ కూడా టెవిస్ నవలలో చెప్పిన దానినే చాలావరకు తెర పై చూపించడానికి ప్రయత్నించాడు.
ఉదాహరణ కు క్లైమాక్స్ ఎపిసోడ్.. బోర్గోవ్ మరియు బెత్ హార్మన్ మధ్య వచ్చే సన్నివేశం నవలలో వ్రాసిన విధం గానే చిత్రీకరించడం మనం గమనించవచ్చు.
ఈ సిరీస్ కోసం అన్యా టేలర్ మరియు సహ నటుడయిన థామస్ బ్రాడీ ప్రముఖ చెస్ ప్లేయర్స్ అయినటువంటి బ్రూస్ పాండోల్ఫీని మరియు గ్యారీ కాస్పరోవ్ వద్ద చెస్ ఆడే విధానం మరియు ప్లేయర్స్ ప్రవరించే విధానం వంటి వాటిపై స్వయం గా శిక్షణ తీసుకోవడం జరిగింది.
ఇవన్నీ కలిసి “ద క్వీన్స్ గ్యాంబిట్” సిరీస్ ని ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అత్యధికులు వీక్షిస్తున్న సిరీస్ గా నిలబెట్టడం జరిగింది. ఈ సిరీస్ అందరి మన్ననలను అందుకోవడం తో పాటు చదరంగం అంటే ఇష్టపడే వారిని మరియు విమర్శకులనీ ఒకే విధం గా అలరిస్తుంది.