“కలర్ ఫోటో” – ఎలాఉందంటే..
టైటిల్: కలర్ ఫొటో
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష, తదితరులు
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
సంగీతం: కాళ భైరవ
బ్యానర్: అమృత ప్రొడక్షన్&లౌఖ్య ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
విడుదల: 23 అక్టోబర్ (ఆహా)
విజయదశమి సంధర్భం గా రిలీజయిన ఏకైక తెలుగు చిత్రం “కలర్ ఫోటో”. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి “ఆహా” లో అక్టోబరు 23 న విడుదలయింది. సుహాస్ ఈ సినిమా తో ముఖ్య పాత్రధారిగా కనిపించగా, చాందినీ హీరోయిన్ గా నటించింది. సునీల్ విలన్ గా మొదటసారి ఈ చిత్రం లో కనిపించాడు. వీరితో పాటు వైవా హర్ష సుహాస్ తో సందడి చేయడం జరిగింది. కాలభైరవ సంగీతం అందించగా, వెంకట ఆర్ శాఖమూరి ఛాయాగ్రహణ భాధ్యతలు నిర్వహించారు.
ప్రేమ కథ కు వర్ణ వివక్ష ను జోడించి 1997 ల ప్రాంతం లో నడిచిన కథ గా చూపించడం జరిగింది.
కథ:
1997 లో మచిలీపట్నం లోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకొనే జయకృష్ణ (సుహాస్) దీప్తి (చాందినీ చౌదరి) అనే అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమించడం, తన కలర్ కి ఆ అమ్మాయి ఒప్పుకొనకపోవచ్చనే కారణం తో ఆ విషయాన్ని తనకి చెప్పకుండా ఉండడం.. ఒకానొక సంధర్భం లో దీప్తి కూడా కృష్ణ తో ప్రేమలో పడటం.. ఈ విషయం కాలేజీ లో తెలిస్తే తన కలర్ ని చూసి ఏడిపిస్తారని వారి ప్రేమను ఎవరికీ చెప్పొద్దని కృష్ణ చెప్పడం.. కానీ ఈ విషయం దీప్తి అన్న ఇన్స్పెక్టర్ రామరాజు (సునీల్) కి తెలియడం తో దీప్తి ని విజయవాడకి పంపి కృష్ణ కాలు విరగ్గొట్టి అతని కెరీర్ ని నాశనం చేయడం వంటి ఘట్టాలతో నడుస్తుంది. చివరికి వారిద్దరి కథ ఎటువంటి మలుపులకు గురయిందనేది ఈ చిత్ర కథ.
విశ్లేషణ:
ఓటీటీ ల హవా మొదలయిన తరువాత చాలామంది తెలుగు మేకర్స్ యొక్క నిర్మాణ శైలులలో మార్పులు వచ్చాయి. కానీ వారింకా సర్దుకుపోవడానికి సమయం పడుతుందని ఇటీవల విడుదలయిన చాలా తెలుగు చిత్రాలు చూస్తే తెలుస్తుంది. కలర్ ఫోటో కూడా ఇందుకు అతీతం కాదు. కొంత చిత్ర నిర్మాణం తరువాత కరోనా రావడం.. కొన్నాళ్ళకు మళ్ళీ మిగిలిపోయిన భాగాన్ని పూర్తి చేసి ఇబ్బందుల మధ్య పోస్ట్ ప్రొడక్షన్ ని కూడా కానిచ్చి ఎలాగూ థియేటర్లు ఓపెన్ కావని తెలిసి కాంప్రమైజ్ తో “ఆహా” లాంటి డిజిటల్ మాధ్యమాల్లో విడుదల చేయడం.. చివరికి కొంత నిరాశ కలుగుచేయడం చూస్తూనే ఉన్నాం. అయితే కలర్ ఫోటో చాలా వరకు ఆ నిరాశను తగ్గించే ప్రయత్నం చేసినా ఇంకా ఇక్కడి జనాలు అలవాటౌ చేసుకొనే స్టేజీలోనే ఉండడం చాలా సినిమాలకు అశనిపాతం గానే కనిపిస్తున్నాయి.
కథానుసారం 1997 లో మొదలయిన ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ ఫార్మాట్ లో నడుస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఛాయాగ్రహణం ఉండడం ఈ సినిమాకు మంచి పాయింట్. దీనికి తోడు సుహాస్, చాందినీ, సునీల్ మరియు హర్ష ల నటన ఫర్వాలేదనిపిస్తుంది. (మిగతా తెలుగు ఓటీటీ సినిమాల్లో పాత్రధారుల నటన తో పోల్చితే చాలా బెటర్..) కథను నడిపించడం లో తడబాటు స్పష్టం గా కనిపిస్తుంది. సినిమా మధ్యలో కొంత విరామం తీసుకొని మళ్ళీ చూసినా ఏదో మిస్సయిన ఫీలింగ్ అస్సలు కలుగదు. చాలా వరకు కథ డైరెక్టర్ తేజ పాత సినిమాల మాదిరిగా కనిపిస్తుంది. ఈ విషయం మేకర్స్ కూడా అర్థమయి దానికి సంబంధించి ఒక డైలాగ్ ని కూడా వదిలారు సినిమాలో..
కలర్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథ ని ఇంత వరకు ఎవరూ టచ్ చేయకపోవడం తో మేకర్స్ కి కథ మరియు స్క్రీన్ ప్లే విషయాల్లో స్వేచ్చా ఉన్నా వినియోగించుకోలేదేమోననిపిస్తుంది. ఎందుకంటే కథని పండించాలనే ఆదుర్దా లో ఎమోషన్స్ ని అంతగా ప్రెజెంట్ చేయలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఇంకా మెరుగుపరిచే అవకాశం ఉన్నా ఎందుకో లైట్ గా తీసుకున్నారన్నట్టు కనిపిస్తుంది. డైలాగ్స్, కెమెరా పనితనం మరియు నిర్మాణ విలువలు బాగున్న ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు ఓటీటీ సినిమాలకు ఒక ఊరటే అని మాత్రం చెప్పవచ్చు.