సూరారై పొట్రు – నేర్పే పాఠాలు..
సుధా కొంగర దర్శకత్వం లో సూర్య ప్రధాన పాత్రలో నటించిన “సూరారై పోట్రు” (ఆకాశమే నీ హద్దు రా!) అమెజాన్ ప్రైమ్ లో తమిళం, తెలుగు, మళయాళం మరియు కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.
మీ కల ను నెరవేర్చుకోవడానికి మీరెంత వరకు వెళతారు..? ఒకవేళ ఎంతవరకయినా వెళ్లగలను అని అనుకునే వారికి “సూరారై పొట్రు” ఒక మంచి మోటివేషనల్ సినిమా అవుతుంది. మారన్ అనే ఒక వ్యక్తి తక్కువ ఖర్చు తో కూడిన విమాన ప్రయాణం అందరికీ అందుబాటులో ఉండాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరికి తాను అనుకున్నది సాధించాడా? వంటి అంశం తో తెరకెక్కిందీ చిత్రం. (ఎయిర్ డెక్కన్ అనే విమానయాన సంస్థ ను ప్రారంభించిన జీ. ఆర్. గోపీనాథ్ నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకొని వెలువడిన “సింప్లీ ఫ్లై” అనే పుస్తకం ఆధారం గా ఈ చిత్రం నిర్మించబడినది.)
విడుదలయిన మొదటిరోజు నుండి అందరి మన్ననలు అందుకుంటున్న ఈ చిత్రం సుధా కొంగర దర్శకత్వం మరియు స్క్రీన్ ప్లే ప్రతిభ ను రుచి చూపిస్తూనే “సూర్య” వంటి ప్రతిభా వంతుడి నటన ను మరోసారి ఆవిష్కరించింది. వీరితో పాటు బొమ్మి పాత్ర పోషించిన అపర్ణ బాలమురళి, ఊర్వశి మరియు పరేష్ రావల్ తమ తమ పాత్రల్లో రాణించారు.
ఈ చిత్రం లో గమనించవలసిన కొన్ని ముఖ్యమయిన అంశాలు:
- కథ మరియు స్క్రీన్ ప్లే:
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకూడయినటువంటి జీ. ఆర్. గోపీనాథ్ బయోగ్రఫీ ని ఆవిష్కరించిన “సింప్లీ ఫ్లై” అనే పుస్తకాన్ని అనుసరించి తీసిన “సూరారై పొట్రు” ఒక మంచి అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కి ఒక మంచి ఉదాహరణ గా చెప్పవచ్చు. కెప్టెన్ గోపీనాథ్ “డెక్కన్ ఎయిర్” అనే విమాన యాన సంస్థని ప్రారంభించి విమాన ప్రయాణాన్ని అందరికీ ఎలా అందుబాటులోకి తెచ్చాడు, దానికోసం ఎటువంటి కష్టాలు పడ్డాడు అనే నిజజీవిత కథ ఆధారంగా వ్రాయబడ్డ పుస్తకం వినడానికి ఒక సినిమాకి పనికివచ్చే లైన్ లా అనిపించవచ్చు. అయితే వచ్చిన చిక్కల్లా అన్ని మంచి పుస్తకాలు మంచి సినిమాలుగా తీయబడగలవని చెప్పలేము.
పుస్తకం చదివేటప్పుడు అది చదివే ఒక వ్యక్తి ఊహ కనుగుణం గా అందులో పాత్రలు ఆ వ్యక్తిని ఎలా ప్రభావితం చేశాయి అనేది మనం గమనిస్తాం. కానీ ఆ పుస్తకాన్ని చాలామంది చూసే ఒక చిత్రం గా తీయాలనుకున్నప్పుడు అందులోని చాలా అంశాలు సినిమాటిక్ గా ఉండకపోవచ్చు. అందువలన చాలా వరకు అడాప్టెడ్ స్క్రీన్ ప్లే లు తెరపైకి వచ్చేసరికి చాలా మార్పులకు లోనవుతాయి. పుస్తకం ఒక వ్యక్తిని చేసే ప్రభావితం సినిమాగా మారినప్పుడు అందరికీ అదేవిధం గా ప్రభావితం చేయలేకపోవచ్చు. అందుకోసం సినిమాకి అనుగుణం గా కథలో చాలా మార్పులు చేయబడుతాయి.
ఉదాహరణకు కెప్టెన్ గోపీనాథ్ నిజజీవితం లో ఒక బ్రాహ్మణుడు. కానీ సినిమాలో మారన్ క్యారెక్టర్ ని ఒక అణగారిన వర్గానికి చెందినవాడిగా చూపిస్తారు. ఎందుకంటే పరేశ్ రావల్ పోషించిన పాత్ర ఒక అగ్రవర్ణానికి చెందినది గా ఉండి తనకంటే తక్కువ వర్గానికి చెందిన వారిని సహించలేని వాడిగా చూపిస్తారు. ఒకవేళ మారన్ క్యారెక్టర్ ని నిజం గా బ్రాహ్మణుడిగా చూపిస్తే వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అంతగా పండే అవకాశముండకపోవచ్చు. హీరో మరియు విలన్ ల మధ్య అంతరాన్ని చూపించడానికి కథ లో చేసిన మార్పు కేవలం సినిమాటిక్ ఎఫెక్ట్ కి సృష్టించడానికి చేసిన ప్రయత్నం గా చెప్పవచ్చు. ఇటువంటి మార్పులు ‘సూరారై పొట్రు” లో చాలానే ఉన్నాయి. సుధాకొంగర ముందు చిత్రం “గురు” లోకూడా హీరోయిన్ అణగారిన వర్గానికి చెందిన అమ్మాయి గా చూపించడాన్ని మనమిక్కడ మరువ కూడదు. అయితే చాలాసార్లు ఈ మార్పులు విమర్శలకు కూడా దారితీసే అవకాశం లేకపోలేదు.
గార్డీ హాఫ్ మన్ అనే రచయిత ఒక పుస్తకాన్ని అడాప్టెడ్ స్క్రీన్ ప్లే గా ఎందుకు, ఎలా మార్చాలి అనే విషయాన్ని క్రింది వీడియో లో చెప్పడాన్ని చూడవచ్చు.
2. పాత్ర ల తీరుతెన్నులు, వ్యక్తిత్వాలు:
కథ లో ముఖ్యపాత్ర కు ఒక బలమయిన కోరిక రగిలేలా చేయడం, తను అనుకున్నది సాధించడానికి ప్రేరణ ను ఇచ్చే వ్యక్తులు మరియు తన జీవితం లో ఎదురయిన ముఖ్యమయిన వ్యక్తులు చూపించే ప్రభావం మొదలగునటువంటి అంశాలకనుగుణం గా ఆ కథ లో పాత్ర ల తీరుతీరు తెన్నులు, వ్యక్తిత్వాలు మరియు సంఘటనలను నిజజీవిత కథ ఆధారంగా మలచుకోవడం ఒక సవాలు.
సూరారై పొట్రు లో మారన్ తండ్రి పాత్ర ద్వారా “మనం అనుకున్నది సాధించేవరకు విశ్రమించకూడదు” అనే సిధ్ధాంతాన్ని కొడుకు అందిపుచ్చుకోవడం.. అందుకు ఎంచుకున్న మార్గాల ద్వారా తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణ ని పుట్టించడం వంటివి కథకు ప్రారంభం గా మారి.. ‘తమ ఊరికి రైలు వచ్చేలా చేసిన మారన్ తరువాతి అడుగులు దేనివైపుకు?” అనే అంశాన్ని ఉన్నతం గా చూపించడానికి మారన్ తండ్రి పాత్రను మలచిన తీరు ఒక చక్కని ఉదాహరణ.
మారన్ పాత్రకి చిన్నప్పటి నుండి అడుగడుగునా చాలా విషయాలు అడ్డుతలుగుతూనే ఉంటాయి. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే అభిప్రాయ బేధాలు కలిగిన వ్యక్తిగా మారన్ పాత్ర మొదలవుతుంది. ఏవియేషన్ అకాడెమీ లో పైలట్ గా జాయిన్ అయినపుడు నాయుడు (మోహన్ బాబు) రూపం లో ఒడిదుడుకులు మొదలవుతాయి. అయితే ఓర్పుతో వాటన్నింటినీ అధిగమిస్తుంటాడు మారన్. విమాన యాన సంస్థ ని ప్రారంభించాలని ఉన్నా దాని మరింత ప్రేరేపించడానికి బొమ్మి (అపర్ణ బాలామురళీ) పాత్ర వ్యక్తిత్వాన్ని మలచిన తీరు కథ కి ‘క్యారెక్టరైజేషన్’ ఎంత ముఖ్యమైనదో మనకు తెలియచేస్తుంది.
బొమ్మి పాత్ర పోషించిన అపర్ణ క్యారెక్టరైజేషన్ ని “మానిక్ పిక్సీ డ్రీమ్ గర్ల్” తరహా వ్యక్తిత్వం గా మనం గమనించవచ్చు.
Definition: Manic Pixie Dream Girl – A type of female character depicted as vivacious and appealingly quirky, whose main purpose within the narrative is to inspire a greater appreciation for life in a male protagonist.
మారన్ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడానికి, అతడిని గమ్యస్థానం వైపు అడుగులు వేసేలా చేయడానికి తన వ్యక్తిత్వాన్ని ప్రయోగించడం, తన లక్ష్యం మారన్ లక్ష్యానికి ఏమాత్రం తీసిపోదని అతడిని రెచ్చగొట్టి ఆ వైపుగా అడుగులు వేసేలా చేయడం, ఎటువంటి సంధర్భం లో మారన్ ముందు ఓటమిని అంగీకరించకపోవడం.. మొదలగునవన్నీ మానిక్ పిక్సీ డ్రీమ్ గర్ల్ క్యారెక్టర్ తరహా లక్షణాలు. సుధా కొంగర ముందు చిత్రం ‘ఇరుది సుట్రు/గురు” లో కూడా “రితీకా సింగ్” కి ఈ తరహా క్యారెక్టరైజేషన్ మనం గమనించవచ్చు.
వీటన్నింటికీ తోడుగా తాను ఆదర్శం గా తీసుకున్న “పరేష్ గోస్వామి” క్యారెక్టర్.. మారన్ యొక్క లక్ష్యానికి, వ్యక్తిత్వానికి తూట్లు పొడిచే వ్యక్తిగా.. ఎవరికోసమయితే విమాన ప్రయాణాన్ని తక్కువ ఖర్చుకు అందించాలని మారన్ తాపత్రయ పడుతున్నాడో వారిని మొత్తానికే సహించలేని పూర్తి వ్యతిరేకమయిన క్యారెక్టరైజేషన్ కలిగిన వ్యక్తిగా పరేష్ పాత్ర తీరు తెన్నులు సాగుతాయి. వీరందరితో పాటు మారన్ తల్లి పాత్ర, మారన్ స్నేహితులు మిగతా వారందరూ మారన్ లక్ష్యం చేరుకోవడానికి సాధనాలుగా మలచడం జరిగినది.
3. సినిమాటోగ్రఫీ:
“ఈ నగరానికి ఏమైంది?” మరియు “యూ టర్న్” సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన నికేత్ బొమ్మిరెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించాడు. ఈ సినిమాకి నికేత్ పనితనం గొప్ప ఎస్సెట్ గా చెప్పవచ్చు. ముఖ్యం గా నికేత్ ఎంచుకున్న షాట్స్ మరియు కలర్ పాలెట్ సినిమా లోని టైమ్ పీరియడ్స్ కి తగ్గట్టు మారడం గమనించవచ్చు. ముఖ్యం గా “ఉడుపి హోటల్ సీన్” లో “లెటజ్ బ్రేక్ every damn రూల్” అన్నప్పుడు సినిమాటోగ్రఫీ కూడా 180 డిగ్రీ రూల్ ని బ్రేక్ చేస్తూ మారన్ మరియు ప్రకాష్ ని ఒకే ఫ్రేము లో రెండు ఫ్రేములుగా చూపించడం చూడవచ్చు..
నికేత్ కెమెరా పనితనానికి ఇదొక మచ్చుతునక మాత్రమే.. సినిమా మొత్తం అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించాడు నికేత్.. ముఖ్యం గా షాట్ సెలెక్షన్స్.. సెంటర్ ఆఫ ద షాట్స్ ఈ సినిమాకే హైలైట్స్..
వీటితోపాటు జీ. వి. ప్రకాష్ సంగీతం మరియు సతీష్ సూర్య ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి కలసి వచ్చాయి.
కొసమెరుపు: స్క్రీన్ ప్లే అడాప్టేషన్ మరియు బయోగ్రఫీ ని ఎలా తెరకెక్కించాలో తెలుసుకొనడానికి సినిమా ఒక కేస్ స్టడీ గా ఉపయోగపడుతుంది.