మిస్ ఇండియా – రుచిగా లేని ఛాయ్
కీర్తి సురేష్ ముఖ్యపాత్ర పోషించిన “మిస్ ఇండియా” నెట్ ఫ్లిక్స్ లో రిలీజయి అప్పుడే వారం గడచినా ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఎవరూ సాహసించడం లేదు. ఈ రివ్యూ కూడా వ్రాయాలా వద్దా అని అనుకుంటూనే చివరకు రాయాల్సి వస్తుంది. ఈ పాటికి అర్థమయి ఉంటుంది మీ అందరికీ “మిస్ ఇండియా” ఏమిటో..
కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో.. రాజేంద్ర ప్రసాద్, నరేష్ మరియు నదియా వంటి యాక్టర్లు ఇతర పాత్రలలో మరియు నెట్ ఫ్లిక్స్ లో విడుదల.. ఎంతో కొంత అంచనాలున్న ఈ సినిమా ఆ మాత్రం అంచనాలను కూడా అందుకోలేక పోయింది. ముఖ్యం గా ఇక్కడి సినిమాల్లో అమెరికన్స్ కానీ ఇతర తెల్ల తోలు నటులు ఎలా నటిస్తారో.. అమెరికా లో చిత్రీకరించిన ఈ సినిమాలో మనవారి నటన కూడా ఆ వారికి ఏమాత్రం తీసిపోకుండా ఎలాంటి ఎమోషన్స్ లేకుండా నడుస్తాయి.
అమెరికా తెలుగు సినిమా కి అచ్చి రాలేదనే చెప్పాలి. అక్కడ చిత్రీకరించిన చాలా సినిమాలు (ఒక్క పడమటి సంధ్యారాగం తప్ప) ఎప్పుడూ చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అక్కడి నేటివిటీ కి మన కథ సూటవుతుందో లేదో అని ఆలోచించకుండా కేవలం లొకేషన్ కోసమే కథని మార్చడం వంటి సాహసాలు ఎప్పుడూ బోర్లా పడుతూనే ఉన్నాయి.
ఈ సినిమాలో సంయుక్త అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి కి ఎం.బీ.ఎ చేసి బిజినెస్ చేయాలనే సంకల్పం ఉంటుంది. కానీ అమ్మాయి కావడం వల్ల అందరూ తన లక్ష్యానికి అడ్డు పడుతుంటారు. తాత చనిపోవడం, తండ్రికి ఆల్జీమర్స్, అక్క ప్రేమ పెళ్ళి చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవడం.. ఇటువంటి సీరియల్ ఎలిమెంట్స్ తో మొదలయిన సినిమా అన్నకి అమెరికా లో జాబ్ రావడం తో ఒక్కసారిగా వారు డబ్బున్న వారివలే ఒక పెద్ద ఇంట్లో, న్యూయార్క్ లో ఉండడం.. సంయుక్త ఎం.బీ.ఎ చేసి కాల్ సెంటర్ లో ఉద్యోగానికి చేరడం.. ఏమిటో.. సీరియల్ గా సాగిపోతున్న సినిమాని నవీన్ చంద్ర తో బ్రేకప్ చెప్పించి సంయుక్త ని బిజినెస్ చేయించడానికి పట్టిన సమయం సినిమా పై ఉన్న ఆసక్తిని ఆవిరి చేసి ఉసూరుమనిపిస్తుంది.
అమెరికా లో టీ బిజినెస్ చేయాలనుకోవడం.. దానికి మిస్ ఇండియా అని పేరు పెట్టడం.. అసలు ఆ ఆలోచన రావడం అమోఘం కదా.. మనవాళ్ళకే ఇంత మంచి ఐడియాలు ఎలా వస్తాయో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. బిజినెస్ మొదలుపెట్టాలనుకొన్న సంయుక్త కి కె. ఎస్. కె. కాఫీ కంపెనీ ఒకటుందని, దానికి ఓనర్ జగపతి బాబని ఎవరో ఒకరు చెప్పడం.. అమెరికా లో ఎం. బీ. ఎ చేసిన సంయుక్త కి అసలు ఆ విషయం తెలియకపోవడం మరీ విడ్డూరం.
ఇకపోతే కీర్తి సురేష్ మరియు జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు, వారు చెప్పే డైలాగ్స్.. ఉదాహరణ కు సంయుక్త “ఆడది తలుచుకుంటే..” అని చెప్పే వాట్సప్ డైలాగులు.. పాత సినిమాల్లో లాగా వెయ్యి డాలర్లు ఇచ్చి సంయుక్త ని రెచ్చగొట్టడం, ఆ డబ్బుతో పాంప్లేంట్లు ముద్రించి “టీ సెరెమనీ” నిర్వహించి వచ్చిన వారికి తెలుగులో టీ గొప్పదనం చెప్పడం తో పాటు శాంపిల్స్ ఇవ్వడం.. కట్ చేస్తే.. లగ్జరీ కారులో నుండి దిగుతున్న సంయుక్త.. తరువాత ఏం జరుగుతుందో ఇంక చెప్పనవసరం లేదు.. మీరు ఊహించినట్లే కథ సాగుతుంది.
సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నా, కథ, కథనం లో పస లేకపోవడం.. సంగీతం గురించి అసలు ఆలోచన రాకపోవడం.. ఈ సినిమాకి పెద్ద దెబ్బలని చెప్పవచ్చు.
ఇక నటన కి వస్తే కీర్తి సురేష్ తనవంతు పాత్ర పోషించినా దర్శకుని అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కీర్తి సురేష్ “మహానటి” తరువాత చేసిన సినిమాలు చూస్తే ఒక సినిమాకి కథ మరియు దర్శకుని పాత్ర ఎంత విలువైనదో అర్థమవుతుంది. ఉత్తమ నటీ నటులనుండు ఉత్తమ నటన రాబట్టుకోవడం దర్శకుని చేతిలోనే ఉంటుందని ఈ సినిమాలు చూస్తే తెలిసివస్తుంది.
ఒక్క జగపతి బాబు తప్ప మిగతా వారందరూ తమ కున్న కొద్ది సేపు పాత్రల్లో మరీ అంత కష్టపడవలసిన అవసరం రాలేదు. జగపతి బాబు అమెరికా లో కాఫీ సామ్రాజ్యం స్థాపించిన బిజినెస్ మ్యాన్ పాత్రలో ఫరావాలేదనిపించాడు. కానీ ఆసక్తికరం గా లేని డైలాగ్స్.. రెండు కంపెనీ ల మధ్య వచ్చే పోటీ సన్నివేశాలని మరీ ఫూలిష్ గా మలచడం.. ఇద్దరి పాత్రల్ని తక్కువ చేసి చూపిస్తాయి.
మొత్తానికి “మిస్ ఇండియా” రుచీ పచి లేని ఛాయ్ అని చెప్పవచ్చు.
Customer Reviews