ఎమిలీ ఇన్ పారిస్ – రివ్యూ
ఈ అక్టోబరు లో మొదలయిన “ఎమిలీ ఇన్ పారిస్” మీరు చూశారా?
చూడకపోతే చూసేయండి.. నెట్ ఫ్లిక్స్ లో.. పది భాగాలున్న మొదటి సీజన్ “ఎమిలీ ఇన్ పారిస్” ఒక కామెడీ డ్రామా.. డారెన్ స్టార్ (సెక్స్ అండ్ సిటీ ఫేమ్) చిత్రీకరించిన ఈ సిరీస్ ఈ కరోనా టైము లో సరదాగా గడిపేయడానికి మంచి కాలక్షేపం.. అంతర్జాతీయ ప్రయాణాలు నిషేధింపబడిన ఈ సమయం లో ఈ సిరీస్ ద్వారా పారిస్ కి ఒక ట్రిప్ వేసినట్టనిపిస్తుంది.
లిల్లీ కొలిన్స్ ఎమిలీ గా నటించిన ఈ సిరీస్ మంచి వ్యూస్ నే కాకుండా విమర్శ లను కూడా ఎదుర్కొంటుంది. ఎందుకంటే పారిస్ ని ఒక అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపించిన విధానం చాలా మంది ఫ్రెంచ్ వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఫ్రెంచ్ జనాలను కన్సర్వేటివ్స్ గా నెగటివ్ కోణం లో చూపించారనే అపవాదు ఈ సిరీస్ లో స్పష్టం గా కనిపిస్తుంది. అయితే దానికి దర్శకుడు డారెన్ ఏమాత్రం క్షమాపణలు కోరడం లేదు. ఎందుకంటే పారిస్ ని అమెరికన్ దృక్కోణం లో ఆవిష్కరించినప్పుడు, అదీ మొదటిసారి పారిస్ ని దర్శించే యువ అమెరికన్స్ కి ఎవరికైనా మొదట నెగటివ్ కోణం మాత్రమే కనిపిస్తుందనీ, కానీ అవేవీ పారిస్ పై వారికి గల ప్రేమ ను ఏమాత్రం తగ్గించవని చెప్పుకొస్తున్నాడు దర్శకుడు.
కథ:
ఎమిలీ కూపర్ అనే 20 ప్లస్ వయసు గల ఒక అమెరికన్ యువతికి అనుకోకుండా వచ్చిన జాబ్ ఆఫర్ కి పారిస్ కి వెళ్లవలసివస్తుంది.
చికాగో నుండి పారిస్ కి వచ్చిన ఎమిలీ ఒక బ్రాండెడ్ మార్కెటింగ్ సంస్థ లో ఇన్ఫ్లూయెన్సర్ గా, ఆ కంపెనీ ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ లో పాపులర్ చేయడం తో పాటు ఆ కంపెనీ కి ఒక అమెరికన్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎలా ఉంటాయో, వాటిని మార్కెటింగ్ కి అనువుగా ఎలా మలచుకోవాలో ఆ కంపెనీకి తెలియచేయడం ఎమిలీ యొక్క బాధ్యత. కానీ ట్రెడిషనల్ గా ఆలోచించే ఫ్రెంచ్ మనస్తత్వాల మధ్య ఇమిడిపోవడం, ప్రతీదాన్ని ఒక రొమాంటిక్ కోణం లో చూసే అలవాటున్న మగవాళ్ళ మధ్య ఎమిలీ ఎలా తన జాబ్ ని నిర్వర్తించింది, ఆమె యొక్క ప్రేమ వ్యవహారం, ట్రయాంగిల్ రిలేషన్ షిప్స్, ఎమిలీ రొమాంటిక్ అడ్వెంచర్స్ మొదలగునవన్నీ ఒక పది భాగాలుగా మొదటి సీజన్ లో కామెడీ ని కలగలిపి చూపించడం జరిగింది.
ఎందుకు చూడవచ్చు:
మొదటి కారణం “ఎమిలీ కూపర్” పాత్ర లో నటించిన లిల్లీ కొలిన్స్. సోషల్ ఇన్ఫ్లూయెన్సర్ గా రొమాంటిక్ ఆకర్షణల మధ్య, కొత్త మనుషులు, కొత్త పద్ధతులు, తెలియని భాష మరియు వ్యవహారాల మధ్య నలిగిపోతూ అన్నింటినీ అధిగమించే ఒక యువతిగా లిల్లీ మనలని ఆకట్టుకుంటుంది.
రెండవ కారణం – అందమయిన పారిస్. మొదటసారిగా పారిస్ కి వెళ్ళాలనుకునే వారికి, ప్రయాణాలు చేసేవారికి ముఖ్యం గా పారిస్ పర్యటన చేయాలని ఉన్నవారికి ఒక ఐడియా ని అందిస్తుందీ సిరీస్. కానీ ఇదొక వ్యక్తి దృక్కోణం మాత్రమే. దీన్ని చూసి పారిస్ మరియు ఫ్రెంచ్ జనాలపై ఒక అభిప్రాయం మాత్రం ఏర్పరచుకోవద్దు. (అమెరికన్స్ మరియు బ్రిటీషర్స్ ఎప్పుడూ ఇతర దేశాలపై తమకున్న తప్పుడు అభిప్రాయాలను రుద్దడం లో సమర్థులని మరచిపోవద్దు..)
మూడవ కారణం – కథ మరియు కథ ని నడిపే విధానం.. ప్రతీ ఎపిసోడ్ ఎమిలీ కి వృత్తి పరం గా విసిరే ఛాలెంజ్ లు, వాటిని తెలివిగా ఎమిలీ ఎదుర్కొనే విధానం ఆకట్టుకుంటుంది. ఫ్యాషన్ మరియు ఫ్రెంచ్ ఫుడ్ పై ఇంటరెస్ట్ ఉన్న వారికి తప్పకుండా నచ్చుతుంది ఈ సిరీస్.
పారిస్ అందం.. ఫ్రెంచ్ జనాలు.. ఫ్రెంచ్ జనాల రొమాంటిక్ వ్యవహారాలు.. ఫ్యాషన్ మరియు ఫ్రెంచ్ ఆహారం వీటన్నింటి మధ్య ఎమిలీ స్నేహాలు మరియు ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారం.. మొత్తం కలిపి “ఎమిలీ ఇన్ పారిస్” మొదటి సీజన్.