ఏమి టార్చర్ సినిమా రా బాబూ..
Blade Runner 2049 సినిమా ఇంటర్వెల్ టైముకి థియేటర్ లో వినిపించిన మాటలు.. కొంతమంది అయితే సినిమా మధ్యలోనే హాలు విడిచి వెళ్ళిపోయారు.. నిజంగా సినిమా అంత ఘోరంగా ఉందా? అంటే కాదనే చెప్పాలి.. నా
చివరి పోస్టు లో చెప్పినట్టు ఈ సినిమా కి మొదటి సారిగా వెళ్ళేవారు తప్పకుండా పాత ఒరిజినల్ వెర్షన్ చూసి వెళితే ఈ సినిమా ని బాగా అర్థం చేసుకోవచ్చు.. కానీ ట్రైలర్ చూసి ఇదేదో రెగ్యులర్
రిడ్లీస్కాట్ మూవీ, ఫ్యూచర్ సైన్స్ ఫిక్షన్ మూవీ కదా గ్రాఫిక్స్ మరియు యాక్షన్ ఎక్కువగా ఉంటుందని వెళితే సినిమా నచ్చకపోదు సరికదా అసలేమి జరుగుతుందో తెలీక గందరగోళం కి గురవడం జరుగుతుంది. ఈ సినిమాని విమర్శించే ముందు మనం తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం..
1. ఇది ఒక నియో నాయిర్ సినిమా: Blade Runner ఒక నియో నాయిర్ జానర్ కి చెందిన మూవీ.. నియోనాయిర్ లేదా నాయిర్ ఫిల్మ్ అనే పదాలు ఫ్రెంచ్ భాష నుండి వెలుగులోకి వచ్చాయి.. ఫ్రెంచ్ ఫిల్మ్ క్రిటిక్స్ అయినటువంటి
Raymond Borde మరియు
Etienne Chaumeton 1955 లో ఈ పదాలను విరివిగా ఉపయోగించడం తో ఈ జానర్ ఎక్కువగా పాపులర్ అయింది. ఈ జానర్ సినిమాలు ఎక్కువగా
డార్క్ మూవీ లు గా పరిగణించబడుతాయి. అంతేకాక వీటిని చిత్ర్రికరించే విధానం కూడా ఒక రకమయిన స్టయిలిష్ గా ఉండి కథ లోని చీకటి కోణాలను, క్రైమ్ సీన్స్ ని ఎలివేట్ చేయడానికి ఈ జానర్ ఒక అస్త్రం గా చెప్పవచ్చు. అయితే ఈ జానర్ గురించి ఎటువంటి ఐడియా లేకుండా వెళితే ఈ సినిమాని పూర్తిగా ఆస్వాదించడం కష్టమే అని చెప్పవచ్చు. అదీకాక
Blade Runner ఈ జానర్ కి అసలయిన నిర్వచనమని కొనియాడబడింది.
Blade Runner 2049 కూడా తన తొలిచిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రీకరించబడింది.. ఇది ఒక పక్కా నియో నాయిర్ డార్క్ మూవీ..
2. ఇది పక్కా Denis Villeneuve మూవీ: ఈ సినిమా డైరెక్టర్
Denis Villeneuve ఇంతకుముందు Arrival (2016), Sicario (2015), Prisoners (2013), Enemy (2013) and Incendies (2010) అనే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలు మీకు నచ్చితే ఈ చిత్రం కూడా మీకు తప్పకుండా నచ్చితీరుతుంది. ఎందుకంటే ఈ సినిమా కూడా
డెనిస్ ఇంతకుముందు చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఇంకాచెప్పాలంటే, వాటిని మించి చాలా జాగ్రత్తగా చిత్రీకరించినట్టు అనిపిస్తుంది.
Blade Runner 2049 ఈమధ్య కాలం లో తీసిన గొప్ప సీక్వెల్ చిత్రం గా చెప్పవచ్చు.
డెనిస్ చిత్రాలు కథాపరం గా ఎక్కువ ఫిలసాఫికల్ గా మరియు సైకలాజికల్ గా ఉండి చూసే ప్రేక్షకులను ఆలోచింపచేసేవిగా ఉంటాయి.
3. Blade Runner సినిమా గ్రాఫికల్ గా కాకుండా ఆర్టిస్టిక్ గా చిత్ర్రీకరించబడినదని గుర్తించాలి. ఈ చిత్రాల్లో ఉపయోగించిన గ్రాఫిక్స్ కంటే వేసిన సెట్టింగు లు ఎక్కువ సంభ్రమాశ్చర్యాల కు గురిచేస్తాయి. ఇవి కథను ఆ కాలానికి తగ్గట్టుగా చూపించడానికి, ఆ సమయానికి ప్రదేశాలకు సరిపోయే మూడ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి వందశాతం ఉపయోగపడినాయని చెప్పవచ్చు.. గమనించాల్సిన విషయమేమిటంటే 1982 లో వచ్చిన సినిమాలోని సెట్టింగులను అదేవిధంగా ఈ చిత్రం లో వేయడం జరిగింది.. వీటితో పాటు
రోజర్ డీకిన్స్ కెమెరా పనితనం,
హాన్స్ జిమ్మర్ మరియు
బెంజమిన్ వాల్ఫిష్ మ్యూజిక్ సినిమా మూడ్ ని వందశాతం ఎలివేట్ చేశాయని చెప్పవచ్చు.
4. కథ విషయానికొస్తే
లాస్ ఎంజెల్స్ 2049 వ సంవత్సరానికి చెందిన సమయానికి దర్శకుడు మనల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. మొదటి సినిమా వచ్చి మూడు దశాబ్దాలు దాటినా మొదటి సినిమాలోని రెప్లికంట్స్ ని వేటాడే "
బ్లేడ్ రన్నర్" హీరో ప్రొఫెషన్ ని ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో హీరో
ర్యాన్ గోస్లింగ్ "K" అనే పేరుగల డిటెక్టివ్. తన కర్తవ్యం అఙ్ఞాతం లోకి వెళ్ళిపోయిన, దాక్కున్న, తమ ప్రొఫెషన్స్ ని మార్చుకొని కొత్తజీవితం జీవిస్తున్నపాత రెప్లికాంట్స్ ని వెతికి పట్టుకోవడం, వారితోపాటు జీవితకాలం పూర్తయినా ప్రశాంతంగా జీవిస్తున్న రెప్లికాంట్స్ ని వెతికి చంపడం. ఈ క్రమం లో హీరో ప్రశాంతం గా జీవిస్తున్న సాపెర్ అనే ఒక రెప్లికాంట్ ని ట్రాక్ చేసి చంపడం, అటునుంచి తన గత జీవితానికి సంబంధించిన మిస్టరీని ఛేధించే క్రమం, అందులో భాగం గా రెప్లికాంట్స్ యొక్క హిస్టరీ, రెప్లికాంట్స్ పై ఙ్ఞాపకాల యొక్క ప్రభావం మరియు మనిషిగా జీవించడం ఎంత ప్రమాదకరమో తెలుసుకొనడం జరుగుతుంది. సహనటులయినటువంటి
డేవ్ బటిస్టా,
హారిసన్ ఫోర్డ్,
జారెడ్ లెటో మరియు
రాబిన్ రైట్ తమ తమ పరిధిమేరకు తమ పాత్రలకు న్యాయం చేయడం మనం గమనించవచ్చు.
5. ముఖ్యంగా
డెనిస్ మరియు
డీకిన్స్ పనితనం చివరి 30 నిమిషాల్లో స్క్రీన్ మీద ప్రస్ఫుటం గా కనిపిస్తుంది. హీరో రేడియేషన్ ప్రభావిత ప్రాంతానికి
హారిసన్ ఫోర్డ్ ని కలవడానికి వెళ్ళే సీన్ లో ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన విధానం, పెద్ద పెద్ద అమ్మాయిల విగ్రహాలు, ఫోర్డ్ మరియు గోస్లింగ్ మధ్య జరిగే చిన్న పోరాటం, దాన్ని చిత్రీకరించిన విధానం.. ఒక విజువల్ ట్రీట్ గా చెప్పవచ్చు. చివరి 30 నిమిషాలను విజువల్ స్టైలిష్ గా, అందంగా తీర్చిదిద్దిన విధానం గమనించదగిన అంశం గా చెప్పవచ్చు. ఇప్పటివరకు 13 సార్లు ఆస్కార్ కి నామినేట్ అయినా అవార్డుని దక్కించుకోలేకపోయిన
రోజర్ డీకిన్స్ ఈ చిత్రానికయినా దాన్ని సాధిస్తాడని ఆశిద్దాం.
6. ఈ చిత్రం లో గమనించదగిన మరో అంశం మెటాఫరిక్ మరియు సింబాలిక్ సన్నివేశాలు. సిటీ లో కనిపించే హాలోగ్రామ్స్ హీరో తన జీవితం లో కోల్పోయినటువంటి వాటిని గుర్తు చేస్తుంటాయి. పెద్ద పెద్ద విగ్రహాల ముందు తన జీవితం ఎంత చిన్నదో, మనిషిగా జీవించడం ఎంత కష్టమో మరియు చెట్టుకి, వుడ్ కి ఎంత విలువ ఉందో చెప్పే సన్నివేశాలు, బిల్ బోర్డ్స్ మొదలగునటువంటివి చాలా ప్రభావితంగా చిత్రీకరించడం ఈ మధ్య కాలం లోనే కాదు, చాలా సంవత్సరాలుగా కూడా రాలేదనే చెప్పాలి. సౌండ్ డిజైనింగ్ ఈ చిత్రాన్ని మరొక మెట్టు ఎక్కించిందని ఎటువంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. కేవలం సౌండ్ డిజైనింగ్ కే ఈ చిత్రాన్ని మరొక సారి చూడొచ్చు. You can't only listen or see it, you can experience it.
Verdict: ఈ చిత్రం మూవీ లవర్స్ కి, మరియు డెనిస్ సినిమాలను ఫాలో అయ్యేవారికి బాగా నచ్చుతుంది. ఈ కథ గురించి, జానర్ గురించి ఎటువంటి ఐడియా లేకుండా వెళితే కొంత నిరాశ కలుగుతుంది. నిర్మాణ విలువల పరంగా, టెక్నికల్ గా ఇటువంటి సీక్వెల్ గానీ, చిత్రం గానీ ఈ మధ్య కాలం లో రాలేదనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ ని, సౌండ్ ని, దర్శకత్వ ప్రతిభని ఆస్వాదించాలనుకునే వారు తప్పకుండా చూడవలసిన చిత్రమిది.
మొదటి 15 నిమిషాలు కొంత చప్పగా సాగినా మెల్లమెల్లగా కథ ఇంట్రెస్టింగ్ గా మారడం జరిగి, క్లయిమాక్స్ వరకు సీటు ఎడ్జ్ లో కూర్చుని చూసే విధంగా ఉంటుంది.
చివరిగా ఈ చిత్రం లో హీరో మనిషియా, రెప్లికెంటా అనేది ప్రేక్షకుడికే వదిలేయడం జరిగింది. మీరేమనుకుంటున్నారో క్రింద కామెంట్ లో తెలియచేయగలరు.
రేటింగ్: 4/5