పారసైట్ – వాసన – మహమ్మద్ ఖదీర్ బాబు
2010లో నేను రాసిన ‘గెట్ పబ్లిష్డ్’ అనే కథలో డ్రైవర్ నయాబ్ చెమట వాసన మారుతుంది. ఏళ్ల తరబడి పొట్టేలు మాంసం తినడానికి యోగ్యత లేకపోవడం వల్ల, గొడ్డు మాంసం మాత్రమే తింటూ రావడం వల్ల అతడి చెమటలో దుర్వాసన మొదలవుతుంది. ఇలా అందరికీ జరుగుతుందో లేదోగాని అతనికి జరిగింది. డ్రైవర్ వృత్తికి వాసన ప్రాణాంతకం. అతని వృత్తి పోతుంది. ఎక్కడ చేరినా పోతూ ఉంటుంది. చెమట వాసన భయంతో అతడు చీటికి మాటికి అత్తరు రాసుకుంటూ ఉంటాడు. చివరికి అదొక ఉన్మాదమే అయ్యి అతణ్ణి పిచ్చివాణ్ణి చేస్తుంది.
‘పారసైట్’ సినిమాలో శ్రీమంతుల ఇంటిలో వంచన కొద్దీ పనికి చేరిన అక్క, తమ్ముడు, తండ్రి బట్టల నుంచి ఒకే రకమైన వాసన వస్తూ ఉందని ఆ ఇంటి చిట్టి యువరాజు కనిపెడతాడు. అప్పుడే ఆ శ్రీమంతులు అలెర్ట్ అయి ఉంటే వారంతా ఒకే కుటుంబం నుంచి వచ్చినవారని గ్రహించి ఉద్యోగాలు ఊడగొట్టి ఉండేవారు. కాని ‘పేదవారి వాసన’ ఒకటే కావచ్చని పట్టించుకోరు. ఆ రాత్రి ఇల్లు చేరిన ఆ కిలాడీ కుటుంబం ‘ఇప్పుడేంటి.. మనం వేరు వేరు వాషింగ్ పౌడర్లతో బట్టలు ఉతుక్కోవాలా’ అని వాపోతుంది. ఎందుకంటే వారికి అది ఖర్చుతో కూడుకున్న పని.
శ్రీమంతుడు కారులో ప్రయాణిస్తూ డ్రైవర్ సీటు కింద నుంచి ఒక ‘పాంటిస్’ను కనుగొంటాడు. బయటకు తీసి కొద్ది దూరం నుంచి వాసన చూస్తాడు. ఉపయోగించిన ఈ పాంటిస్ డ్రైవర్ ఎవరితోనో చేసిన పాడు పనికి సాక్ష్యం అనుకుంటాడు. ఇంటికి వచ్చి భార్యతో కోపంగా అనే మాట– ‘వాడు నా కారులో చేస్తే చేశాడు. వాడి సీటులో చేసుకొని ఉండొచ్చుగా. నా సీటులో (బ్యాక్ సీట్లో) ఎందుకు చేశాడు?’.
ఆ డ్రైవర్ కాసేపైనా తన స్థానంలోకి రావడం, తన స్థానంలో కొన్ని వాసనలు విసర్జించడం అతనికి భరింపశక్యం కాని పని. కాని పేదవారికి ఎందుచేతనో వాసనలు వెంటాడుతూనే ఉంటాయి. ఒక కుంభవృష్టి కురిసిన రాత్రి వాన వరదగా మారి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం చేసినప్పుడు, బేస్మెంట్ అనే నేలమాళిగ కొంపలో కాపురం ఉంటున్న కిలాడీ కుటుంబంలో ప్రతి బొచ్చె, ప్రతి బొంతా మునిగిపోయి ఏం మిగలక దివాలా తీస్తున్నప్పుడు, ఉన్న కాసిన్ని వస్తువులనైనా కాపాడుకుందాం అని వారు పాకులాడుతున్నప్పుడు టాయిలెట్ నుంచి ఎగదన్ని ఎగదన్నీ దాని క్యాప్‌ను ఎంత బలంగా మూస్తున్నా ఆ కశ్మలం ఎగదన్నుతూ ఒక దుర్వాసన వస్తుందే… ఆ దుర్వాసన పేదవారికే తెలుస్తుంది. శ్రీమంతులకు తెలియదు.
ఆ కుంభవృష్టి కురిసిన రాత్రి అక్కడ శ్రీమంతుల ఇంట్లో పిల్లవాడు రెయిన్ టెంట్ తీసుకొని బయలులో దానిని వేసుకొని ఆ టెంట్‌ను ఎంజాయ్ చేస్తూ నిద్రపోతాడు. ఆ కుంభవృష్టి కురుస్తున్న రాత్రి ఆ శ్రీమంతులైన భార్యాభర్తలు ఒకరితో ఒకరు కూడవలసిన సమయం అని భావించి ఒకరి గుండెల్లో ఒకరు ముఖాలను గుచ్చుకుంటారు. ఒక కుంభవృష్టి కొందరికి అద్దాల నుంచి వీక్షించదగినది. కొందరికి సహాయ శిబిరాలలో తల దాచుకోదగ్గది.చూడండి… తెల్లవారితే శ్రీమంతులకు ఎలాంటి నొప్పీ లేదు. అంత పెద్ద వాన కురిసి వేల మంది రోడ్ల పాలైతే ఇక్కడ హాయిగా బర్త్‌డే పార్టీ మొదలైపోయింది. రాత్రంతా సహాయ శిబిరంలో గడిపిన కిలాడీ కుటుంబం ఎలాగోలా డ్యూటీలకు హాజరవుతుంది. కాని అందరి వొంటి నుంచి వాసన. మురికి వాసన. చెమట వాసన. పేద వాసన. గతి లేని వాసన. ఇంత కన్నా ఘోరమైన వాసన ఉన్న మనిషి ఒకడు ఉన్నాడు. చేసిన అప్పుకు భయపడి చేతిలో రూపాయి మిగలక ప్రాణాలు కాపాడుకోవడానికి అదే ఇంట్లోని బంకర్లో ఎవరికీ తెలియకుండా నాలుగేళ్లుగా జీవిస్తూ ఉన్నవాడు.
కంపు మోస్తున్న ఒక మురికి మనిషి ఉనికి మీద తమ మహా సౌధం ఉందని ఆ శ్రీమంతులకు తెలిస్తే రియాక్షన్ ఎలా ఉండేదో. ఈ లోపే ఆ బంకర్లోని మనిషి బంకర్ నుంచి బయట పడి, బర్త్‌డే పార్టీలో దూరి, కత్తితో దాడి మొదలెడతాడు. వాణ్ణి చూసి పుట్టినరోజు పిల్లవాడు స్పృహ తప్పుతాడు. వాడి కత్తి దాడికి కిలాడీ కుటుంబంలోని అక్క రక్తసిక్తమవుతుంది. ఏమీ తోచని ఆ హఠాత్ సమయంలో ఇంటి యజమాని తన పిల్లవాడి ప్రాణాలు కాపాడుకోవడానికి కారు తాళం కోసం ప్రయత్నిస్తాడు. పెనులాటలో ఆ కారు తాళం బంకర్ మనిషి వీపు కింద పడుతుంది. యజమాని దాని కోసం బంకర్ మనిషిని సమీపిస్తాడు. అప్పుడు… అంత గందరగోళ పరిస్థితిలో కూడా… అంత ప్రాణాంతక సందర్భంలో కూడా ఆ శ్రీమంతుడు తన జాతి లక్షణాన్ని మానుకోడు. ఆ బంకర్ మనిషి వొంటి నుంచి వచ్చే దుర్వాసనకు ముఖం చిట్లిస్తాడు. అది పేదవారందరికీ డబ్బున్నవారందరి నుంచి ఎదురయ్యే ఒక అవమానం. ఎంతకాలం ఆ అవమానం? దీనికి ముగింపు పలకాలి. కిలాడీ కుటుంబంలోని తండ్రి కత్తి అందుకుంటాడు. జరిగిన హత్య శ్రీమంతుడిదే కావచ్చు. కాని హతమవ్వాల్సింది ఈ అమానవీయమైన అసమానత అని సంకేతం.
ఎత్తు ప్రాంతంలో శ్రీమంతులు. అధోజగత్తులో పేదలు. ఎవరిని ఎవరు పీక్కు తింటున్నారు? ఎవరు ఎవరిపై వాలి బతుకుతున్నారు? కోట్లాది పేదలు శ్రమ చేసి చెమట చిందించి ఆ చెమట వాసనను విసర్జిస్తేనే కదా రాజమహళ్లు వెలుస్తాయి. ఆ వాసనా మీకు ఏవగింపు?… అని కథ. వలస కూలీలు వందలాది కిలోమీటర్లు కాలి నడనక నడుస్తుంటే వారిపై పారసైట్లుగా బతికే వర్గాలు ఈ లాక్డౌన్ సమయంలో ఈ సినిమాలో శ్రీమంతులకు ప్రతినిధుల్లా కనిపిస్తే దోషం లేదు.పేదవాడికి ఆకలి వాసన ఉన్నంత కాలం శ్రీమంతుడికి అసౌకర్యమైన వాసన తప్పదని చెప్పే సినిమా – పారసైట్.
- మహమ్మద్ ఖదీర్ బాబు (ఒరిజినల్ ఫేస్ బుక్ పోస్ట్ ఇక్కడ చూడగలరు)