ఈ సమయాలు – చార్లీ చాప్లిన్ – ఖదీర్
‘గోల్డ్ రష్’లో నిర్మానుష్య అలాస్కా మంచు దిబ్బల మధ్య చాప్లిన్‌కు ఆకలి వేస్తుంది. ఒంటరి కేబిన్‌లో తోడుగా ఉన్న సాటి వేటగాడికి అప్పటికే ఆకలితో మతిపోయి ఉంటుంది. భ్రాంతులు కూడా కలుగుతుంటాయి. కాని చాప్లిన్ నింపాదిగా ఉంటాడు. తన కాలి షూ బాగా పొగలు గక్కేలా ఉడకబెడతాడు. దాని మీద ఉప్పు జల్లి రెండు భాగాలుగా చేసి తన వాటాకు వచ్చిన సోల్‌ని మెల్లగా భుజించడం ప్రారంభిస్తాడు.
అనివార్యమైన పరిస్థితులు వచ్చినప్పుడు గతాన్నీ భవిష్యత్తునూ వదిలిపెట్టి ప్రస్తుతంలో ఉన్నవాడు చేసే పని అది. భయంకరమైన ఆకలిని, మంచు తుఫాన్లను ఎదుర్కొని నిలిచిన అతనికి చివరకు బంగారం దొరుకుతుంది. జీవితం మనల్ని ‘షూ ఘట్టాన్ని’ దాటి ‘బంగారు ఘట్టాన్ని’ చేరమని అప్పుడప్పుడు పరీక్షలు పెడుతుంటుంది.
ఒంటరి దీవిలో చిక్కుకున్న ‘రాబిన్సన్ క్రూసో’ కించిత్ కూడా భయపడక శతృదుర్బేధ్యమైన ఇంటిని నిర్మించుకుంటాడు. అడవిలో విస్తారంగా పండే ద్రాక్షను నెలల తరబడి ఆకలి తీర్చేందుకు ఎండబెట్టి దాచుకుంటాడు. నర మానవుడు లేని ఆ దీవిలో చలించక నిలబడినందుకు ప్రకృతి మెల్లగా తోడు మనిషిని, ‘మ్యాన్ ఫ్రైడే’ని పంపుతుంది. అంతిమంగా అతడు ఆ దీవి నుంచి బయటపడే తీరుతాడు.
డెవిల్స్ ఐలాండ్‌లో జైలుశిక్షకు వెళ్లిన ‘పాపిలాన్’ తనకు కేటాయించిన ఒంటరి గదిలో ఎలాగైనా బతికి తీరాలని నిశ్చయించుకుంటాడు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాడు. దొరికిన పురుగూ పుట్రను తినడానికి వెనుకాడడు. శతృవు నుంచి కాపాడుకోవడానికి నిత్యం ఆయుధాన్ని ధరించి తిరుగుతాడు. లక్ష విఫల ప్రయోగాలు చేస్తాడు పారిపోవడానికి. తుదకు స్వేచ్ఛ కదా పొందుతాడు.
భయం, సందేహం, ఊహ ఇప్పుడు మనల్ని చుట్టుముట్టి వుంటాయి. ధైర్యం నాలుగో స్థానంలో ఉంటుంది. ఆశ ఐదో స్థానంలో. కనీ వినీ ఎరగనివి వచ్చినప్పుడు ఎలా ఉండాలో మనకు తర్ఫీదు లేదు. జపాను వారు భూకంపాలకు ఎప్పుడూ సిద్ధమై ఉంటారు. అమెరికన్లు కనీసం కల్పిత గ్రహాంతరవాసుల కోసం సిద్ధమై ఉంటారు. తెలుగువారికి ఏ సిద్ధత, సంసిద్ధత ఎప్పుడూ అవసరం పడలేదు. మనకు తెలిసింది దోమ కోసం బ్యాట్ పట్టుకోవడం. తుఫాన్ వస్తే రేడియో ఆన్ చేయడం.
కాని ఇప్పుడు వచ్చింది ఇంకా పెద్దదిగా వచ్చింది. అంచనాకు దొరకనిదిగా వచ్చింది. ఇంకా అర్థం కావలసినదిగా వచ్చింది. శారీరకంగా బలంగా ఉండే సమయంగా కన్నా మానసికంగా బలంగా ఉండాల్సిన వేళ ఇది. నిజ పాత్రల ధైర్యమూ సాహిత్యంలో ఉన్న పాత్రల భరోసా రెండూ కావాలి ఇప్పుడు.
ఇప్పుడు మనతో మనం గడపగలిగినవారము, మన కుటుంబంతో గడపడం తెలిసినవారము ప్రాథమిక విజేతలం. మనతో మనం గడపడం రాకపోయినా, కుటుంబంతో గడపడం – వారితో ఏవైనా పగుళ్లు ఉంటే సరి చేసుకొని గడపడం, ఈ సమయంలో పగుళ్లు పెరగకుండా చూసుకొని గడపడం తెలియకపోతే అలాంటివారము బయటి ప్రమాదం కంటే లోపలి ప్రమాదంలో ఎక్కువ ఉన్నట్టు.
ఇది మొదలు. సుదీర్ఘ సమయం ముందు ఉంది. ఎడమొగం పెడమొగం ఇల్లు ఇప్పుడు మనలేదు.అలాగే మాట్లాడుకోవాల్సిన సమయాలు ఇవి. ఒకరినొకరు భయపెట్టుకోవడానికి కాదు. ఒకరినొకరు ధైర్యం చెప్పుకోవడానికి. ఒకే పడవలో అందరం సహ ప్రయాణికులం అని చెప్పుకోవడానికి. ఆశ కల్పించుకోవడానికి. షూ ఉడకబెట్టుకొని తినవలసి వస్తే చెరిసగం తిందాము లేవోయ్ అని జోకులేసుకొని నవ్వుకోవడానికి ఇప్పుడు మాట్లాడుకోవాలి.
అన్నట్టు– మంచి స్నేహితులు ఉన్నవారు కూడా ఈ సమయంలో సగం విజేతలు. నా మిత్రులారా…. మనందరం ఈ కాలాన్ని దాటి ఒకనాడు నవ్వుకుంటూ ఈ విషాద సమయాన్ని తలుచుకుంటామనే ఆశిస్తాను.
- మహమ్మద్ ఖదీర్ బాబు (ఒరిజినల్ ఫేస్ బుక్ పోస్ట్ కోసం ఇక్కడ చూడగలరు)