శీతల కటి – మంటో – ఖదీర్
ఎక్కడికెళ్లావ్ పది రోజులుగా’ తలుపులు దడేలున మూసింది. గొంతులో ఒరిపిడి. పిక్కల్లో సలపరింత చూడగానే.
‘ఎక్కడికీ వెళ్లలేదు’ అటూ ఇటూ నడిచాడు.
‘అబద్ధం చెప్తున్నావ్’ వచ్చి చేతులు వేసింది. ఛాతీని ఛాతీతో గుద్దింది. నడుమును నడుముకు వేసి రుద్దింది. వచ్చినవాడిది ఉక్కులాంటి ఒళ్లు.
‘నిన్నూ’ ఎత్తి నాలుక్కాళ్లూ దిట్టంగా ఉన్న మంచాన పడేశాడు.
‘చెప్పు ఎక్కడికెళ్లావ్ పది రోజులు’ ప్రశ్న వేస్తూ ఉంది గాని ఒంటి మీద ఒంటిని వేసి వెచ్చబెడుతూ ఉంది. పసుపులా ఉన్న ఒళ్లు. గంధంలా ఉన్న ఒళ్లు. చుట్టిన పూలచెండులా ఉన్న ఒళ్లు.
‘నిన్నూ’ కరిచాడు మెడను. కరిచాడు పెదాలను. నాకాడు శునకంలా చుబుకాన్ని.
‘నిన్నూ…’ ‘రా.. రా… చూసుకుందాంరా’ ‘నిన్నూ’… బట్టలు ఎందుకు వేసుకుంటారో మనుషులు. చించెయ్యాలి వీటిని. చీలికలు పీలికలు చేసెయ్యాలి వీటిని. చేశాడు. చేయడానికి సహకరిస్తూ ఉంది. మీద పడ్డాడు. పడటానికి సహకరిస్తూ ఉంది. మొత్తం ఒంటిని పంట కరిచి గొంతులో వేసుకొని మింగేలా ఉన్నాడు.
‘అలాగే మింగాలి. మింగరా’ ‘నిన్నూ’… గొంతు బలహీనమవుతుంది.
‘ఊ.. అలాగే.. రా..’ ‘నిన్నూ’… ఒంట్లో గాలి పోతున్నట్టుంది.
‘ముక్కెయ్రా మగడా. అసలు ముక్కెయ్. తురుపు ముక్కెయ్. విసురూ… విసురూ’ కటిని ఎగరేస్తూ ఉంది.
‘నిన్నూ’… పక్కకు వాలిపోయాడు. చెమటగా రాలిపోతున్నాడు. నిస్సహాయంగా తూలిపోతున్నాడు.
‘వెధవా’ శివంగిలా లేచింది. ‘ఎవత్తిరా అది నిన్నిలా చేసి పెట్టింది. ఎవరు నిన్ను పిండి వదిలిపెట్టింది. ఎవత్తది’
‘ఎవరూ లేరు… ఎవరూ లేరు’
‘నమ్మడానికి చిన్నపిల్లనన్నుకున్నావా.. చేతకానిదాన్ననుకున్నావా’… పక్కనే బాకు ఉంది. వాడిదే. వాడెప్పుడూ వాడేదే. తీసి మెడ మీద గుచ్చింది.
‘దేవుడి మీద ఆన. ఏం జరిగిందో చెప్పు. ఎందుకు ఇంత చల్లబడిపోయావో చెప్పు’… నెత్తురు కారుతూ ఉంది. బొట్లుబొట్లుగా.
‘చెప్..తా… చెప్..తా’
‘మాటలు మింగకు. చంపుతా’
‘గొంతు కోశావ్… ఇంతకన్నా వేగంగా మాట్లాడలేను’
‘చెప్పు’…
‘వేటకు వెళ్లాను. దొమ్మీ వేటకి. రక్తపు వేటకి. అల్లర్లు జరిగే ఊరిలో కత్తి పట్టుకు దూరాను. పాకిస్తాన్ హిందూస్తాన్ల పందేరంలో నా వంతు వాటా కోసం దిగాను. ముస్లింలు హిందువులు ఊచకోత కోసుకుంటూ ఉంటే మధ్య నా బాకుకు పని చెప్పడానికి దూకాను. ఒక ఇంట్లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఆరుమంది మగవాళ్లు. అందరినీ చంపేశాను.
ఏడో మనిషి ఆడపిల్ల’
‘ఊ.. చెప్పు’ ఛాతీ మీదకు ఒంగి వింటోంది.
‘భుజాల మీద వేసుకొని బయటకు పరిగెత్తాను. దొరికింది పిల్ల. దొరికింది’
‘తర్వాత?’.. రొప్పుతూ ఉంది.
‘దారిలో చెట్లు కనిపించాయి. వెనుకనే గడ్డి ఉంది. వెళ్లి పడుకోబెట్టాను’ ‘….’ ‘కాసేపు ఆడుకుందామా అనిపించింది. కాని ఆగలేకపోయాను. ముక్క విసిరాను. తురుపు ముక్క విరిరాను. గట్టిగా లోపలికంటా ముక్క వేగంగా విసిరాను’…
‘అ… అయితే’..
‘ఏం చెప్పను.. ఏం చెప్పను నీకు’ చెమటలు కారిపోతున్నాయి. కంఠం ఒణుకుతోంది.
‘అప్పటికే.. అప్పటికే ఆ అమ్మాయి చచ్చిపోయి ఉంది. చచ్చిపోయిన అమ్మాయితో నేను. శవంతో నేను. చల్లారిపోయిన మాంసంతో నేను. శీతలమైన కటితో నేను.. నేను’… ‘…..’
‘ఒక్కసారి నీ చేయి అందిస్తావా?’ చేయి అందించింది. చాలా శీతలంగా చేయి తగిలింది.
***
మంటో రాసిన విశ్వవిఖ్యాతమైన ‘ఠండా గోష్’ కథకు నా అనుసృజన ఇది.
ఇవాళ ఇలాంటి కథలు రాసేవారు లేరు. ఉన్నా వేసే పత్రికలు లేవు. వేసినా ఏమవుతుందో తెలుసు. కాని దాదాపు 70 ఏళ్ల క్రిందటే మంటో ఈ సాహసం చేశాడు. కాగితం కలంతో కార్చిచ్చు రగిలించాడు. మర్యాదస్తుల పైజామా బొందులు కదిలిపోయేలా చేశాడు.
1955లో పాకిస్తాన్లో చనిపోయాడు మంటో. కాని నాటి నుంచి ఇరుదేశాల సాహితీ సమాజాలలో అతను సజీవంగా ఉన్నాడు. దినదినాన చిరంజీవై వర్థిల్లుతున్నాడు. సత్యం చెప్పడానికి భయమెందుకు… అరిచి చెప్పు సత్యాన్ని అని మంటో అన్నాడు. అన్నట్టు బతికాడు.
‘మంటో’ సినిమా చూస్తూ ఉంటే ఇన్నాళ్లూ విన్న సాహితీ ప్రపంచంలోకి ప్రయాణించి వచ్చినట్టుగా అనిపించింది. మంటో, ఇస్మత్ చుగ్తాయ్, కిషన్ చందర్, అశోక్ కుమార్, శ్యామ్ చద్దా, ఫైజ్ అహ్మద్ ఫైజ్… వీరంతా తెర మీద కనిపిస్తూ ఉంటే పాత్రలై మాట్లాడుతూ ఉంటే ఆ సాహిత్యం అంతో ఇంతో తెలిసిన వారికి ఒళ్లు ఉబ్బితబ్బిబ్బవుతుంది. దేశ విభజనను ద్వేషించిన మంటోకు, హిందూ ముస్లిం కొట్లాటలను చూసి ఈసడించుకున్న మంటోకు, ఆ రక్తపాతాన్ని చూసి ఒణికిపోయిన మంటోకు, నిలువెల్లా నీరయ్యి పిచ్చిపట్టినట్టుగా కథలు రాసిన మంటోకు, అక్షరానికి అబద్ధపు మకిలి అంటకుండా అది కణకణమని వెలిగేలా చేసిన మంటోకు, మనిషిలోని నైచ్యానికి సాహిత్యంలో ఒక సాక్ష్యాన్ని పెట్టిన మంటోకు, చరిత్రను కథగా చేసిన మంటోకు, పూర్వికుల పాపాన్ని మనమైన కడుగుదాం అని రాబోయే భావితరాల కోసం ఆశపడిన మంటోకు… ఈ సినిమా ఒక కృతజ్ఞత.
నందితా దాస్ అనే ఒక పురోగామి ప్రకటించిన కృతజ్ఞత. సత్యవాది ప్రకటించిన కృతజ్ఞత.
***
‘ఖోల్ దో’, ‘బూ’, ‘ఠండా గోష్’, ‘టొబా టేక్ సింగ్’, ‘కాలి సల్వార్’… ఈ మంటో కథలు చదవని పాఠకులు వెలితి ఉన్న పాఠకులు. ‘మంటో’ సినిమా చూడని సాహితీకారులు వెలితి ఉన్న సాహితీకారులు.
***
సత్యం పలకదలుచుకున్న కలాలకు మరణసందేశాలు అందుతున్న ఈ క్షణాన,
ద్వేషాన్ని దహించాలనుకున్న కలాలకు కఫన్ గుడ్డలను కానుకగా పంపుతున్న ఈ కాలాన,
ఉన్మాదాన్ని నేలకేసి రాయాలనుకున్న సిరాకారులకు విరిగిన ములుకుల హెచ్చరికలు అందుతున్న ఈ సమయాన…
ఒక చైతన్యవంతమైన ఆలోచన పుట్టకముందే చనిపోవడానికి సిద్ధపడి బెంబేలెత్తుతున్న ఈ సందర్భాన…
సకలాన్ని ఆర్పివేసి శీతలం అతి శీతలం చేసేస్తున్న ఈ దుర్ముహూర్తాన –
వంద మంటోలు ఉదయించనీ. వేయి మంటోలు ప్రభవించనీ.
- మహమ్మద్ ఖదీర్ బాబు (ఒరిజినల్ ఫేస్ బుక్ పోస్ట్ కోసం ఇక్కడ చూడగలరు)