వక్త్ నే కియా క్యా హసీ సితమ్ – ఖదీర్
‘ఈ పాటకు లిప్ మూవ్మెంట్ ఉండదు’ అన్నాడు గురుదత్.
‘అదేమిటి? లిప్ మూవ్మెంట్ లేకుండా పాట ఎలా ఉంటుంది?’ అని ఆశ్చర్యపోయింది వహీదా రెహమాన్.
‘అదంతే. ఈ పాట నీ మనసు పాడుతుంది. అన్ని విషయాలు నోరు తెరిచి చెప్పక్కర్లేదు. కొన్ని మనసులో అనుకున్నా వినపడతాయి. నువ్వు వూరికే కెమెరా వైపు నేను చెప్పినట్టు చూడు చాలు’ అని గురుదత్ ఆ పాట లిప్ మూవ్మెంట్ లేకుండానే తీశాడు.
అలా అంతకు ముందు ఎవరూ తీయలేదు.ఈ పాట కోసం మెహబూబ్ స్టూడియోలో పొడవైన నీడలు కావాల్సి వచ్చాయి. స్టూడియో అధినేతైన మెహబూబ్ ఖాన్‌ను రిక్వెస్ట్ చేసి, గోడ పగులగొట్టి కన్నం వేసి ఎండ లోపల పడేలా చేశాడు. వర్క్ విషయంలో గురుదత్ పట్టింపుకు వంక లేదు. వ్యక్తిగత విషయంలో ఎంచకుండా వదలాల్సిన దోషం లేదు.గురుదత్‌కు డబ్బు బాగానే ఉండేది. లోనావాలాలో ఫామ్ హౌస్ ఉండేది.
‘కాగజ్ కే ఫూల్’ ఫ్లాప్ తర్వాత ‘చౌద్వీ కా చాంద్’, ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’ సూపర్ హిట్ అయ్యాయి. అయితే తల పెట్టుకోవడానికి కావాల్సిన స్త్రీ ఎద భార్యది మాత్రమే అని అనుకోలేకపోయాడు. వహీదా రెహెమాన్ ఈ పెళ్లయ్యి ముగ్గురు బిడ్డల తండ్రయిన వ్యక్తి జీవితంలో ఎంతవరకు ఉండాలి, అతణ్ణి ఎంతవరకు ఉండనివ్వాలి అనే విషయంలో ఉన్మత్తమైన దగ్గరితనమూ దూరమూ ప్రదర్శించింది.
వహిదా రెహెమాన్ గట్టిగా “నో” చెప్పాకే గురుదత్వా డెవాస్టేటెడ్ అయ్యాడని అంటారు. బే కరార్ దిల్ ఇస్ తర్హా మిలే…గురుదత్ ముందు నుంచీ డిప్రెషన్ పేషెంట్. జానీ వాకర్, దేవ్ ఆనంద్‌లతో స్నేహమూ, హాస్య ప్రియత్వమూ, కళను చూసి పురివిప్పే గుణమూ ఆ డిప్రెషన్‌ను దాటడంలో సహాయపడలేకపోయాయి. ఇవాళ ఉన్నవాళ్లు రేపు కూడా ఉంటారని నమ్మాడు.
చౌరస్తాలో నాలుగు నిమిషాలు కలిసినంత మాత్రాన, కూర్చుని అన్నం పొట్లాలు విప్పి తిన్నంత మాత్రాన, మనం వెళ్లిన వైపు వెళ్లినంత దూరం తోడు రావాలని లేదు.
వహిదా రెహమాన్ బాల్యఆరాధన, ఆమెపై గురుదత్ మోహ వివశత్వం ఇరువురికీ ఏ రసాత్మక ఆలంబన ఇచ్చినా మొదట చెదిరింది గీతా దత్ గుండె. కూలింది ఆమె కాపురం. పిల్లలను తీసుకొని ఆమె నిలుచున్నది రోడ్డు మీద. గురుదత్ ఆమెను కాపాడుకోలేకపోయాడు. వహిదా రెహమాన్‌తో బంధం నిలబెట్టుకోలేకపోయాడు.
ఎక్కువమంది చెప్పేది ‘నాకు ఇద్దరూ కావాలి’ అనేది అతడి కామన. గురు దత్, గీతా దత్ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పొగిలి మద్యం వల్లే మరణించారు. గురుదత్ మద్యానికి నిద్ర మాత్రలు జత చేశాడు. దానిని కొందరు ఆత్మహత్య అన్నారు.
హమ్ భీ ఖోగయే… తుమ్ భీ ఖోగయే ఏక్ రాహ్ మే చల్ కే దో కదమ్… కైఫీ ఆజ్మీ ఈ పాట రాశాడు. ఎస్డి బర్మన్ ట్యూన్ చేశాడు. వహీదా రెహమాన్ నటించింది. గీతా దత్ పాడింది. గురుదత్ డెరైక్ట్ చేశాడు.
ఇవాళ్టికీ ఆ పాట వినిపిస్తుంది. గురుదత్ చనిపోయిన ఇవాళ్టి రోజున పదే పదే రేడియోలో ప్లే అవుతుంది. ఉత్కృష్టమైన సృజనకారుల బంగారు రోజులను జ్ఞప్తికి తెస్తుంది. వారి తప్పిదాల నుంచి హెచ్చరికను వినిపిస్తుంది. చిన్న నొప్పి ఉంటుంది. అంతలోనే ఉన్నదానిని ఒకసారి సరి చూసుకొని, దగ్గరగా జవురుకొని, హమ్మయ్య అనుకొని గేరు మార్చి ముందుకు పదమంటుంది. పట్టుకుని ఉన్న చేతులు భద్రం. పట్టు తప్పే చేతలూ భద్రం.
- మహమ్మద్ ఖదీర్ బాబు (ఒరిజినల్ ఫేస్ బుక్ పోస్టు కోసం ఇక్కడ చూడగలరు)