రజనీగంధ ఫూల్ తుమ్హారే… ఖదీర్

‘ఆ పాట తెలిస్తే పాడండి’ అనేవాణ్ణి, పాటలు తెలిసిన స్నేహితురాళ్లు కలిసినప్పుడు. ‘రజనీగంధ ఫూల్ తుమ్హారే’ వంటి పాట పాడాలంటే సహజమైన గాత్ర అనుగ్రహం ఉండాలి. పెట్టుడు గొంతు పనికి రాదు. గతంలో పాటలు తెలిసిన స్నేహబృందాలు ఉండేవి. పాటల సాయంత్రాలూ ఉండేవి. పాట తెలిసి ఉండటం సాంస్కృతిక స్థాయిగా ఉండేది.

Watch Rajnigandha - Disney+ Hotstar
  • Facebook
  • Twitter
  • reddit

ఈ పాట నీకు తెలుసా… ఆ పాట నాకు తెలుసే అని అనుకోవడం పరస్పర మెచ్చుకోలుగా ఉండేది. బాలగోపాల్, వేమన వసంతలక్ష్మి ఉన్న 302, కిరణ్ అపార్ట్‌మెంట్స్‌లో రెండుసార్లు రెండు భిన్న గాత్రాలతో ఈ పాట విన్నాను, అడిగి. ఇద్దరికీ సహజమైన ఫ్లో ఉంది. ఆ రాత్రి చాలా పాటల నడుమ ఆమె – నేత చీర కప్పిన మోకాళ్లను చుబుకానికి తగిలేలా మడిచి- ఈ పాటను అతి సుందరంగా పాడటం మరువలేను.

అధికార్ ఏ జబ్‌సే సాజన్ కా హర్ ధడ్‌కన్ పర్ మానా మైనే’… లైన్ వచ్చినప్పుడు ఆమె ‘ఈ లైను నా కాలేజీ రోజుల తెలియనితనంలో ఓకే కాని ఇప్పుడు కాదు. ప్రేమలో అధికారం ఏమిటి, అతనికి అధికారం ఇచ్చి లొంగిపోవడం ఏమిటి’ అని అనడమూ గుర్తే. ఈ చైతన్యం ఉన్న సమూహాలు నాడు విరాజిల్లేవి. నీళ్ల బాల్చీ ముందు ముంగాళ్లపై కూలబడి మెల్లగా నులుముతు ఉంటే బట్టకు పట్టిన మురికి ఎలా వదిలిపోతుందో పాటలు వినేకొద్ది మనలోని మురికి కూడా మెల్లగా వదిలిపోతుంది.

జడత్వంలో ఉన్న దేహ రసాయనాలను సంయోగక్రియలోకి నెట్టే శక్తి పాటకు ఉంది. ఆ సంయోగాలన్నీ అమృత సంయోగాలు. ఆయువును ఉద్దీపనం చేసే సంయోగాలు.

సలీల్ చౌధురి చేసిన ఏ పాటైనా చూడండి, ఈ పాటతో సహా, మనల్ని కదిలిస్తాయి. వాన ఆగాక నీరు కుదళ్ల కడ సుడి తిరుగుతూ పారుతుందే అలా పారుతుంది అతడి పాట. రజనీగంధ చిన్న సినిమా. కాని పెద్ద సంగీతం ఇచ్చాడు. ఈ పాట రికార్డింగ్‌కు వచ్చినప్పుడు లతాకు పాట సాహిత్యం నచ్చలేదు. అంత బాగలేదు కదా అన్నది. రాసింది యోగేష్. ఆమె డేట్ జారితే మళ్లీ రికార్డింగ్ ఎప్పుడో. యోగేష్ భయపడుతూనే ఒక గంట సమయం అడిగి దూరంగా పరిగెత్తి పారిపోయి ఈ పాట రాశాడు. లతకు ఈ పాట, దీని సాహిత్యమూ చాలా ఇష్టం. ఈ పాట పాడటానికి ఒక్క రూపాయి మాత్రమే ఫీజ్ తీసుకుంది.

హిందీ గీతకర్తలలో ఇందీవర్, యోగేష్‌లు ‘హిందీ ప్రయోగాలు’ మాత్రమే చేసి తీరాలనే నియమాన్ని పాటించినవారు. ముస్లిం కవుల ఉర్దూ ప్రయోగాల మధ్య యోగేష్ ఈ పాటలో వాడిన ‘అనురాగీ మన్’ వంటి మాటలు కొత్త అందాన్ని తెస్తాయి.

ఇదే సినిమాలో ‘కహీ బార్ యూభి దేఖా హై’ పాటనూ మనం మర్చిపోం. దినేష్ ఠాకుర్, విద్యా సిన్హా బొంబాయి రోడ్ల మీద టాక్సీలో తిరుగుతుంటారు.. దానికి పాట కావాలి అని సలీల్ చౌధరిని అడిగితే సమయానికి ఇవ్వలేకపోయాడు. బాసూ చటర్జీ మొదట విజువల్స్ తీశాడు. తర్వాత పాట జత చేయబడినది.

ఈ సినిమాలో ఉన్న విద్యా సిన్హాను పోలిన వాళ్లు డెబ్బయిలలో ప్రతి వీధిలో ఉండేవారు. కాని అప్పటికి నాలాంటి చిన్నపిల్లాళ్లు వారిని చచ్చినట్టు ‘అక్కా’ అని పిలవాల్సి వచ్చేది. బాల్యంలో మోహం ఒక వాస్తవం. విద్యా సిన్హా మొన్న మరణించింది. కాని ఆమె జీవించినది మాత్రం డెబ్బైల కాలమే. ఆ కొద్ది సంవత్సరాలే ఆమె అసలైన ఆయువు.

‘నా జానే క్యూ హోతా హై ఏ జిందగీ కే సాథ్’….

Was this helpful?

About Author /

కథ మరియు నవలా రచయిత, కాలమిస్ట్

Leave a Comment

Your email address will not be published.

Thanks for submitting your comment!

Start typing and press Enter to search

Share This