మనసు తెలుగు మట్టిలోనే ఉంది – యాత్ర – ఖదీర్
‘న్యూజిలాండ్‌లో మంచి జీవితం పెట్టుకుని ఇతనికి ఇదేం పిచ్చి’ అనుకున్నాను మొదటిసారి మహి వి.రాఘవ్‌ను కలిసినప్పుడు. కాటన్ షార్ట్స్, టీ షర్ట్, ఒళ్లో ల్యాప్‌టాప్ పెట్టుకుని తాను తీయబోయే మొదటి సినిమా ‘పాఠశాల’కు మాటలు రాయమని సంప్రదించాడు నన్ను. మహి బాగా చదువుకున్నాడు. న్యూజిలాండ్‌లో మంచి ఉద్యోగం చేశాడు. అక్కడి పౌరసత్వం కూడా ఉందని చెప్పినట్టు గుర్తు. కాని భార్యను, కుమారుణ్ణి తీసుకొని హైదరాబాద్ వచ్చేశాడు.
దర్శకుడిగా ఎవరి దగ్గరా పని చేయలేదు. కాని మొదటి సినిమా డెరైక్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. అతని ద్వారానే నాకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌లోని ‘బియాండ్ కాఫీ’కేఫ్ పరిచయమయింది (తర్వాత ఆ టైటిల్‌తో నా కథల పుస్తకం వచ్చింది). అక్కడే చాలాసార్లు కలిశాను. బుర్రలో ఒక ఆలోచన పడితే మహి అది పక్వానికి వచ్చే వరకూ అగమ్యంగా తిరుగుతూ ఉంటాడని ఏదో ఒక దూరప్రాంతానికి వెళ్లి నెలల తరబడి కూచుంటాడని మాటల్లో తెలిసింది.
ఇంత తిక్కతో సినిమా రంగంలో చాలా పోరాటాలు చేయాల్సి ఉంటుంది అనుకున్నాను. మహి ‘పాఠశాల’ తీశాడు. అభిరుచి ఉన్న ప్రేక్షకులు బాగుందన్నారు. కాని డబ్బులు రాలేదు.అందరూ దెయ్యాలకు మనుషులు భయపడే సినిమాలు తీస్తుంటే దెయ్యాలు మనుషులకు భయపడే సినిమాను ‘ఆనందో బ్రహ్మ’గా తీశాడు. ఈసారి డబ్బులు వచ్చాయి. నలుగురి దృష్టిలోనూ పడ్డాడు. కాని మహి నిజంగా అందరికీ తెలిసింది ఇప్పుడు. ‘యాత్ర’ తీసినప్పుడు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాదయాత్రను తెర మీద రిక్రియేట్ చేయడానికి పూనుకున్నప్పుడు.
మహికి చాలా టేస్ట్ ఉంది. ఆఫీస్‌ను చాలా అందంగా పెట్టుకుంటాడు. అతడి సొంత ప్రొడక్షన్ హౌస్ పేరు కవితాత్మకంగా ‘మూన్ వాటర్ పిక్చర్ ప్రొడక్షన్’గా ఉండటం నన్ను కుతూహల పరిచింది. ఈ టేస్ట్ ఉన్నవాడు కనుకనే యాత్ర టైటిల్‌ను పాదముద్రలా రాయించడంతో అందరి దృష్టి పడేలా చేసుకున్నాడు. మమ్ముట్టిని ఎంచుకుని ఇంకా ఆశ్చర్యంలో పడేశాడు. ‘యాత్ర’ను వంద కోట్లతో తీయవచ్చు. కాని తాను అనుకున్న బడ్జెట్లోనే ప్రభావవంతంగా తీశాడు.
‘యాత్ర’ ఒకరకంగా రోడ్ మూవీ. లొకేషన్స్ మారుతూ ఉంటాయి. జనాన్ని కేరీ చేయాలి. టేకులు రీటేకులు ఉంటాయి. వాటన్నింటిని హ్యాండిల్ చేసి సినిమాను నిలబెట్టుకోగలిగాడు. లౌడ్‌గా వెర్బల్‌గా చెప్పి వై.ఎస్ క్యారెక్టర్‌ను గొప్పదిగా చూపే ప్రయాస పడకుండా అడుగులు కొనసాగే కొద్దీ ఆ పాత్ర ఎలివేట్ అయ్యేలా చేశాడు. మమ్ముట్టి వై.ఎస్లా మారిపోవడంలో మహి కృతకమైన అడ్డంకులు వేయలేదని సినిమా చూసినవారికి అర్థమవుతుంది.
ఇందులోని ‘రూపాయి డాక్టర్ ఎపిసోడ్’ ఎంబిబిఎస్ చేసి ఓత్ తీసుకునే సమయంలో ప్రతి మెడికోకు చూపించాలి.చరిత్ర అనగానే చాలాదూరం వెళ్లక్కర్లేదు. వర్తమాన రాజకీయ చరిత్ర కూడా సినిమాయే అని మనవాళ్లు గ్రహిస్తున్నారు. పుస్తకం ముట్టబోరేమో అని అనుమానం కలిగిస్తున్న భవిష్యత్ తరాల వారు మన మనుషులను, రాజకీయ ఘట్టాలను ఇలా నమోదైన విజువల్ మీడియా ద్వారానే తెలుసుకుంటారేమోనని అనిపించింది. మహి ఎక్కడెక్కడో చదువుకుని, ఉద్యోగం చేసి వచ్చి ఉండవచ్చు. కాని ఈ సినిమా ద్వారా కథలను ఈ మట్టిలోనే వెతుక్కుంటున్నాడని తెలియచేశాడు. ఇంకా చాలా నేటివ్ స్టోరీస్ ఉన్నాయి. తీయాలి మహీ. అభినందనలు.
- మహమ్మద్ ఖదీర్ బాబు (ఒరిజినల్ ఫేస్ బుక్ పోస్ట్ ని ఇక్కడ చూడగలరు)