నిమిరిన ఆ చేతిపై ఒక అశ్రువు – మల్లేశం – ఖదీర్

మల్లేశం ఇక్కత్‌ చీర తెచ్చిస్తాడు భార్యకు. మడిచిన, కొత్త, మెత్తటి, రంగులీనుతున్న చీర. భార్య అక్కరగా అందుకుంటుంది దాన్ని.

‘ఎంత బాగుంది బావా. నేయడమేగానీ ఎప్పుడైనా కట్టుకుంటే కదా’ అంటుంది – దాని పై చేయి వేసి స్పర్శను గుండెలోకి తీసుకుంటూ.

మా నాన్న కావలి పాతూరులో ఇల్లు కట్టించాడు. మెట్లకు ఆనుకునే చిన్న గది ఉంది. 1980లో మేము గృహ ప్రవేశం చేశాము. ఆ గదిలో ఈనాటికీ మేము కూర్చున్నది లేదు. పడుకున్నదీ లేదు. ఆ గదికి కావలిసిందల్లా ఒక ట్యూబ్‌ లైటు… ఫ్యాను. అవి మా నాన్న వేయించలేదు. ఊరిలో పేరుమోసిన ఎలక్ట్రీషియను. కరెంటు పనోడు. పొద్దున లేస్తే ఫ్యాన్లు రిపేరు, ట్యూబ్‌లైట్ల బిగింపు ఇవే ఆయన పని. కాని తన ఇంట్లో వైనం చేసుకునే వీలు, శ్రద్ధ, ఆ కాసింత అదనపు స్తోమత లేకపోయాయి.

కుమ్మరివానికి కుండలు కరువు’ అని మా అమ్మ అనేది. మల్లేశం తల్లి, భార్య, బహుశా వేలాది మంది నేత స్త్రీలు తాము నేసే ఆ అందమైన, చూడ చక్కని, వొంటిని మెత్తగా చుట్టుకునే, రంగు రంగుల చీరలను కట్టే స్థితికి చేరుకుంటారా ఎప్పుడైనా?

Mallesham Movie Review
  • Facebook
  • Twitter
  • reddit

మల్లేశం ఎలక్ట్రీషియన్‌గా పని చేయడం నాకు నచ్చింది. అందుకు చాలా మైండ్, అప్రమత్తత ఉండాలి. అవి ఉన్నవాడు కనుకనే ఆసు మిషన్‌ కనిపెట్టాడు. మల్లేశం ఊరి సంస్కృతి, మిశ్రమ సంస్కృతి, ఆదరణీయ సంస్కృతికి బహుశా చివరి తరం ప్రతినిధి. పీర్ల పండక్కు వేషం కట్టిస్తానని అతడి తల్లి మొక్కుకుంది. పీర్ల పండక్కి ఊర్లలో మల్లెలు ధరించిన పీర్లు కవాతు చేస్తాయి. నిప్పుల గుండం చుట్టూ అన్ని మతాల వాళ్లు చేతులు పట్టుకుని దూలా ఆడతారు.

పీరు పట్టుకుని గుండంలో నడిచినవాడు అవతలి గట్టుకు చేరి తీరుతాడే తప్ప కాళ్లు కాలి మధ్యలో కూలబడడు. ఆసు యంత్రం కనిపెట్టడానికి మల్లేశం ఏడేళ్ల పాటు నిప్పుల నడక నడిచాడు. గట్టుకే చేరాడు. చేరతాడు. మిశ్రమ సంస్కృతి ఇచ్చే, ముందు నుంచీ నాటే, అంతర్గత బలం ప్రతిఫలనం ఇది.

చాలా ఆవిష్కరణల్లో ఈ సినిమాలోని లేత్‌ ఓనర్‌ అయిన ముస్లింల వంటి వారు ఉంటారు. వారి భాగస్వామ్యం ఉంటుంది. మల్లేశం వారి భాగస్వామ్యాన్ని కూడా చూపడం బాగుంది. సమస్త రంగాల్లో వాస్తవిక స్థాయిలో ముస్లింల (మైనారిటీల) భాగస్వామ్యం చూపినప్పుడే వారు కూడా తాము ఈ సమాజంలో సమాన భాగస్వాములు హక్కుదారులు అని భావిస్తారు.

ముంబై పరిశ్రమ ఆ మధ్య కొంత విరామం ఇచ్చినా ఇటీవల ఆ పని స్థిరంగా చేస్తోంది. తెలుగులో ముస్లింల భాగస్వామ్యాన్ని ఎరుకతో చూపిస్తున్నవాడు శివ కొరటాల. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఏ సినిమాలోనూ ముస్లిం పాత్ర లేదు (ఇన్ని సినిమాల తరువాత ‘అరవింద సమేత’లో హాస్యానికి వాడుకున్న ‘ముస్లిం మంద’ తప్ప).

చిన్నవాళ్లు సాధించే పెద్ద విజయాలు చిన్నవాళ్లందరూ కలిసి ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. చిన్న చిన్న మెట్లే పెద్ద నిచ్చెన. కాళ్లు విరిచేసే, కాళ్లు కదలనివ్వని, కాళ్లు సాగనివ్వని పరిస్థితులు ఉన్నాయి. పెరిగాయి. పెరుగుతాయి. మల్లేశంకు అతని భార్య చేయి తోడు ఉన్నట్టు, ‘ఎడ్డి మడ్డి’ దోస్తుల తోడు ఉన్నట్టు, అతన్ని అర్థం చేసుకున్న ఒకే ఒక ఊరి వృద్ధుడి తోడు ఉన్నట్టు అందరి తోడు పెంచుకోవాలి. ఉంచుకోవాలి. గట్టిగా పట్టుకోవాలి. అలా బంధానికి బిగించే ప్రతి చేతికీ ముద్దు. కడిగే కంటి చినుకు.

పి.ఎస్‌: నా ఇష్టమిత్రులు పెద్దింటి అశోక్‌ కుమార్, లక్ష్మణ్‌ ఏలే, వెంకట్‌ సిద్ధారెడ్డి ఈ సినిమాకు పని చేశారు. వీరికి నా ప్రేమ, గౌరవం.

Was this helpful?

About Author /

కథ మరియు నవలా రచయిత, కాలమిస్ట్

Leave a Comment

Your email address will not be published.

Thanks for submitting your comment!

Start typing and press Enter to search

Share This