దో దివానే షెహర్ మే – ఖదీర్

పెద్ద దూరం ఏమీ కాదులే. నిన్నో. మొన్నో. రెండు జాముల అవతలో. మూడు కాలల ముందరో. కలిసే కదా తిరిగాం. వేళ్లల్లో వేళ్లు గుచ్చి. భుజానికి భుజం రాసీ. కెనెటిక్ హోండా కీస్ అందుకుంటూ ఉండు ఇప్పుడే వస్తానని చెప్పి గదిలోకి వెళ్లి తిరిగి వచ్చి ఇక పదా అన్నావు. ఏంటి అన్నాను. లోపల వేసుకుని వచ్చాను… లేకుంటే నడుపుతుంటే కదులుతుంటాయ్ అంటే అయిదడుగుల ఏడంగుళాల మగాణ్ణే అనుకో. సిగ్గేసి చచ్చాను. పాన్‌పరాగ్ వక్కపొడి మింట్… దరిద్రం.. శుభ్రంగా ఫ్రిజ్ నీళ్లు తాగి అప్పుడు కదా ముద్దు పెట్టుకోవాలి అంటే జిల్లంది బాటిల్ వల్లనా పెదాల వల్లనా?

Classic: Love, longing and disillusionment in Gharonda - Rediff.com Movies
  • Facebook
  • Twitter
  • reddit

బాహువులున్నప్పుడు బాహుమూలాలు కూడా ఉంటాయి. అక్కడ తడవకూడదంటే దేవతలకు అర్జీ పెట్టుకోవాలి. మనిషి నుంచి సువాసన రావాలి. అది చెమటదైతే ఏమి. చెలిగింతదైతే ఏమి.షేక్ హ్యాండ్ ఇచ్చి ఇది చాల్లే అంటే చాల్లేమ్మని అనుకున్నాను. వెనక్కు తిరిగి నువ్వు నడిచి పోతుంటే నడుముకు కూడా ఎత్తెత్తి వేసే పాదాలు ఉంటాయని చూసి తెలుసుకున్నాను. సారధి స్టుడియోలో ఆ చీకటి స్క్రీనింగ్ హాల్లో ఫిల్మ్ క్లబ్‌వారి ఫలానా పోలాండ్ సినిమాను సబ్ టైటిల్స్ లేకపోయినా కమ్మగా వేడివేడి మొక్కజొన్న పొత్తు తింటూ చూశాం. రాత్రికి రూములో వంట లేదని తెలుసు. గనకనే నువ్వు పక్కనున్న ప్రతి క్షణం ప్రేవులను నింపుతూనే ఉన్నాను సంతోషాన్ని కూరి.

జానెవో కైసే లోగ్ థె జిన్ కే… ఇది పాడితే ఇంప్రెస్ అవుతావా?

దో దివానే షెహర్‌మే. దీనికి కాదూ. వారెవ్వా. జరీనా నువ్వేనా. మధ్య పాపిడి తీసి, చిన్న కొప్పు చుట్టి, మెడకు ముత్యాల పట్టీ చుట్టబెట్టి.. బర్గండీ అంటావా ఆ కలరూ… దానికి బ్లాక్ బ్లౌజ్.. నెమలి పింఛాల పవిటా…

ఇన్ భూల్‌భులయ్యా గలియోంమే అప్‌నా భి కోయి ఘర్ హోగా…

అసలు చాలామందికి పాదాలు కనపడకుండా చీర కట్టడం రాదు. జరీనా కడుతుంది. నువ్వూ కడతావు. అయితే అతనిలా నీ హ్యాండ్‌బ్యాగ్‌ను భుజాన జార విడిచి ఎప్పుడూ మోయలేదనుకో. అందులోని డబ్బు ఖర్చు పెట్టేగా నా ఫలానా పుట్టిన రోజు సాయంత్రం కొత్త చారాల చొక్కాను గదిలో జార విడిచి తుర్రుమన్నావ్.

అస్మానీ రంగ్ కే ఆంఖోమే………. అస్మానీ? యా ఆస్మానీ?

రోదసి రంగు కనులదానా… దైవ దొంతర మార్గాల నలుపు నిండినదానా… నీ కనులు అబద్ధాలు చెప్పవు… నాలుక చివరలతో కనురెప్పల మీద రాయగలిగేదే మంచి కథ అన్నావు. నాటికి రెండు పుస్తకాల రచయితనే అనుకో. చేతగాక చచ్చాను. ఎందుకో తెలియదు… ఈ తురుకవానికి వెండి అత్తరు సీసా బహుమతిగా ఇచ్చావు. పది క్రోసుల కాలం కరిగిపోయింది. అత్తరు ఇగిరిపోయింది. కాని పరిమళం అలాగే ఉంది. నీ కంఠాన్ని నాసికతో తాకినప్పుడు.

పల్ భర్‌కే లియే… పల్ భర్‌కే లియే…

పల్ భర్‌కే లియే ఇన్ ఆంఖోమే ఏక్ జమానా ఢూండ్‌తే హై…

ప్రెస్‌క్లబ్ మీటింగ్‌లు అలాగే ఉన్నాయి. అల్లా జమీల్యా పుస్తకాలు అల్లాగే ఉన్నాయి. ‘అస్తిత్వ’ సినిమా సెంకండ్ షో చూసి గంభీరంగా మారి అంతరాత్రి నడుచుకుంటూ వచ్చిన అబిడ్స్ దారులు అలాగే ఉన్నాయి. హరిహర కళాభవన్, ఆర్ట్ గ్యాలరీ, గోల్డెన్ థ్రెషోల్డ్, ఆ మూల మీద నువ్వు ప్రతిసారీ కొనే అరటిపండ్ల బండి, బేకరీలో వేడి- పొరలు విడివడే- దిల్ పసంద్… ఈ నగరం.. షెహర్ అల్లాగే ఉన్నాయి.

పాటా ఉంది. పల్లవి కొంచెం మారింది. ఏక్ దివానా షెహెర్ మే…ఈ పూట ఈ పాట నిన్ను మొత్తంగా గుర్తు చేసినందుకు కొంచెం కోపంగానే ఉందనుకో.

Was this helpful?

About Author /

కథ మరియు నవలా రచయిత, కాలమిస్ట్

Leave a Comment

Your email address will not be published.

Thanks for submitting your comment!

Start typing and press Enter to search

Share This