కథ ను సినిమాగా తీస్తే.. ఖదీర్ బాబు

‘అతడు ఆ ఇంటి ముందు తడిసిన కాకి వలే నిలుచుని ఉన్నాడు’… అని తొలి వాక్యం రాసుకున్నాను ‘ఒక వంతు’ కథ కోసం. ఈ వాక్యంతో కథ రాయబోతున్నాను అని ‘మామండూరు’ (తిరుపతి) రైటర్స్ మీట్‌లో ప్రకటించాను. ఆరు నెలలు గడిచాయి. ఆ వాక్యం దాటి ఒక్క వాక్యం పుట్టలేదు. లోపల కథ లేదా అంటే ఉంది. పూర్తిగా ఉంది. కాని ఎలా చెప్పాలో తెలియడం కదా కథ తెలియడం అంటే.

పత్రికల్లో పని చేయడం వల్ల ఇంటర్వ్యూలు కూడా చదవాల్సి ఉంటుంది. సుచిత్రా కృష్ణమూర్తి శేఖర్ కపూర్‌తో విడిపోయాక ఇంటర్వ్యూ ఇస్తూ ‘ఏమో మళ్లీ కలుస్తామేమో. నాలో ఒక వంతు అతణ్ణి ఇష్టపడుతూనే ఉంది’ అంది. అదీ కథ. ఈ విడిపోయిన మనిషి వచ్చి గేటు ముందు నిలుచుని ఉన్నాడు. ఇంట్లోకి వెళ్లాలి. కాని తర్వాతి వాక్యం తట్టడం లేదు.

ఆరు నెలల తర్వాత ఆ వాక్యాన్ని కొట్టేసి ‘మీ అమ్మ నన్ను చూస్తే దరిద్రంగా ముఖం పెడుతుంది. ఇక వెళతానులేమ్మా’ అనే వాక్యం రాశాను. అంటే ఇంటి ముందు ఉన్న మనిషి ఈ వాక్యంతో ఇంట్లోకి వచ్చేశాడు. కూర్చుని చాలా సేపయ్యింది. ఇంకో పాత్రను ప్రస్తావిస్తూ కథ కూడా మొదలెట్టేశాడు. సగం కథ గడిచిపోయినట్టే. ఇక అక్కణ్ణుంచి రాయడం సులువు. ఫైన్‌గా నేరేషన్ కుదిరిన కథలలో ఇది ఒకటి. నా కథలలో కాదు. తెలుగు కథలలో. దీనిని కరుణ కుమార్ షార్ట్ ఫిల్మ్‌గా తీశాడు, అతి తక్కువ ఖర్చుతో. ఈ కథలో నాకు అతడి కంటే ఆమె ఇష్టం. ఆమె పాత్ర పోషించిన అంజలి చాలా బాగా నప్పారు. భర్త పాత్ర నేనే కావచ్చు. రఘు కుంచె కూడా. లేదా అహానికి కట్టుబడలేని ఏ మగాడైనా.

కడలి మా కథామొలక. కథ ఇస్తున్నాను. చదివి ఫిల్మ్ చూడండి. లేదా ఫిల్మ్ చూసి కథ చదవండి. రాయాలనుకున్నవారికీ తీయాలనుకున్నవారికి కూడా ఇదొక ఎక్సర్‌సైజ్.

ఒక వంతు ‘నన్ను చూస్తే మీ అమ్మ దరిద్రంగా ముఖం పెడుతుంది. ఇక వెళతానులేమ్మా’ అన్నాడతను. అలా అన్నాడుగాని కుర్చీలో నుంచి లేవలేదు. టక్ చేసిన షర్టూ ప్యాంటులో పూర్తిగా జారగిలబడినట్టుగా కూర్చుని కూతురినే చూస్తూ ఉన్నాడు. అతడి కాళ్ల దగ్గర చిన్న ట్రావెల్ బ్యాగ్ ఉంది. ఫ్లయిట్‌లో వచ్చాడనడానికి గుర్తుగా దాని చేతులకి లగేజ్‌ట్యాగ్ వేలాడుతూ ఉంది.

ఉదయం ఢిల్లీ నుంచి వచ్చాడు. తిరిగి రాత్రికి వెళ్లిపోతాడు. తండ్రి మరి చాలాసేపటిదాకా కదలడని ఆ అమ్మాయికి తెలుసు. రెండు మూడునెలలకొకసారి జరిగే ఈ ఘట్టంలో ఆమె ముఖ్య పాత్రధారి. అతడు ఫోన్ చేసి వస్తాడు. కూతురిని కలిసి సంతోషంగా కబుర్లుచెబుతాడు. మధ్యాహ్నం వాళ్లిద్దరూ లంచ్‌కు బయటకు వెళతారు. మళ్లీ సాయంత్రం ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక మళ్లీ కూతురితో కబుర్లు చెబుతూ కూర్చుంటాడు. మధ్య మధ్యలో ఫ్లయిట్‌కు టైమ్ అయ్యింది అంటాడుగాని కదలడు. ఆఖరుకు ఆఫీసు నుంచి తల్లి ఇంటికి వచ్చి బయట అతడు వదిలిన షూస్‌నో ఇంట్లో వ్యాపించిన పలుచటి సిగరెట్ వాసననో పసిగట్టి వేగంగా చెప్పులు విడిచి నిరసనగా అతడి ముందు నుంచే డ్రాయింగ్ రూమ్‌లో విసవిసా నడిచి వెళ్లి ధడేలు మని బెడ్‌రూమ్ తలుపు వేసుకుంటే అతడికి మనశ్శాంతి.

‘అమ్మయ్య… మీ అమ్మ నన్ను చూసి దరిద్రంగా ముఖం పెట్టిందమ్మా. ఇక వెళతా’ అని బయలుదేరుతాడు. తల్లి చూపే అయిష్టమే తండ్రి తిరుగు ప్రయాణానికి సరిపడేంత టికెట్ అని కూతురికి అనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి అతడు ఆమె పట్ల చాలా ఇష్టమున్న వ్యక్తిలా వచ్చి ఆ ఇష్టాన్ని ప్రదర్శించలేక ఆ ఇష్టంవల్ల ఆమె ఎదుట బలహీనపడలేక ఆమె చూపే అయిష్టంతో పౌరుషం తెచ్చుకొని అక్కణ్ణుంచి నిష్ర్కమిస్తుంటాడని కూడా అనిపిస్తూ ఉంటుంది.

ఇవాళ తల్లి ఇంకా ఆఫీసు నుంచి రాలేదు. తండ్రి కుర్చీలోంచి కదలడం లేదు. ఆమె వస్తే తప్ప కదలను అన్నట్టుగా ఉన్నాడతను. టీపాయ్ మీద అతడు తెచ్చిన పూలు ఎవరో నిరాకరించినట్టుగా పడి ఉన్నాయి. వచ్చిన ప్రతిసారి అందమైన పూలు తెస్తాడు. కూతురికి ఇచ్చినట్టుగా వాటిని ఇచ్చివెళతాడు. తల్లికి పూలంటే ఇష్టమని కూతురికి తెలుసు. కాని అతడు వెళ్లాక ఆ పొడే గిట్టనట్టుగా తల్లి వాటిని డస్ట్‌బిన్‌లో గిరాటు వేస్తూ ఉంటుంది.

చీకటి పడుతూ ఉంది. హైద్రాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ చిక్కనవుతూ ఉంది. ఆ అమ్మాయి లేచి ఇంట్లోని లైట్లన్నీ వేసి తండ్రిని అర్థం చేసుకున్నదానిలా నవ్వుతూ ‘కాఫీ పెట్టనా నాన్నా’ అంది. బూడిద రంగు కార్గో ప్యాంట్… దానిపైన బంతిపువ్వు రంగు టీషర్ట్ వేసుకొని టీనేజ్‌లో ఉండే సహజమైన సౌందర్యంతో మిలమిలా మెరిసిపోతున్న కూతురినే చూస్తూ అంగీకారంగా నవ్వాడతడు.

‘ఎందుకు నవ్వుతున్నావు నాన్నా’ అందా అమ్మాయి.

‘మీ అమ్మను చూడు… నాతో పోట్లాట పెట్టుకొని నన్నసలు ఎప్పటికీ చూడొద్దనుకుంది. నువ్వేమో నా నోట్లో నుంచి ఊడిపడినట్టున్నావు. ఉదయం లేస్తే నీలో నేనే కనబడుతుంటాను తల్లీ’ అన్నాడతను నవ్వుతూ. ఆ అమ్మాయి కూడా నవ్వింది. ఆ నవ్వు చూసేసరికి అతడికి కాస్త ధైర్యం వచ్చింది.

ఈ ఇంట్లో నాకు ఆ మాత్రం స్వతంత్రం ఉండదా అనుకొని ‘పోనీ… నేను కలపనా కాఫీ’… అన్నాడతను చొరవగా లేచి బెల్టు సర్దుకుంటూ. ఆ పిల్ల అదిరిపడినట్టుగా ఆగి ‘వద్దు వద్దు’ అంది చాలా కంగారుగా.

‘అమ్మ వచ్చి చూసిందంటే… అందులోనూ వంటగదిలో. అసలు నీకు డ్రాయింగ్ రూమ్‌లోనే పర్మిషన్ లేదు. మనం బయట కలుద్దాం నాన్నా అంటే వినవు. వద్దు వద్దన్నా ఇంటికే వస్తావు. అమ్మ సంగతి తెలిసీ కావాలనే చేస్తావా ఏమిటి నాన్నా’ అంది లోపలికి వెళుతూ. ఆ దెబ్బకు అతడు పిడికిలంత అయిపోయాడు. ఊపిరి పీల్చేసిన వాడిలా కూలబడుతూ- ‘బయట కలవడానికి నువ్వేమైనా గాలివా ధూళివా అమ్మా. నాకూతురివి. నువ్వు ఎలా ఉంటున్నావో నాకు తెలియవద్దా’ అన్నాడు.

‘ఏం తెలియాలి నాన్నా నీకు’ అందా అమ్మాయి చికాకు బయటకు తెలియ నీకుండా వంటగదిలో నుంచే.

‘నువ్వు రోజూ ఉండే ఇల్లు ఎలా ఉంటుంది… నువ్వు నిద్రపోయే గది ఎలా ఉంటుంది… నువ్వు తాకుతూ నిలబడేగోడల రంగు ఎలా ఉంటుంది… నీ బట్టల బీరువా… పుస్తకాల ర్యాక్… చెప్పులస్టాండ్…. నువ్వు అదే పనిగా నొక్కే రిమోట్…. ఇంట్లో తండ్రి ఉండడు కదా… ఆ తండ్రి వచ్చినప్పుడైనా నీ ఇంట్లో నువ్వు ఓదార్పుగా సంతోషంగా వేసే నాలుగు అడుగులు నేను చూడవద్దా. మీ అమ్మతో పాటు ఎలా ఉంటావో గమనించవద్దా? నీ నుంచి దూరంగా ఉంటాను కదమ్మా. నిన్ను గుర్తు చేసుకున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నళ్ల పొగలో ఎయిర్‌పోర్ట్ గోలలో హోటల్ లాంజ్‌లో పది మంది మధ్యన కలిసిన జ్ఞాపకంలా ఉంటే ఆ తండ్రి బతుకు ఎంత హీనం తల్లీ’ అన్నాడు.

తండ్రి గొంతులోని దాపరికం లేని ఏడుపుకు ఆ పిల్ల విలవిల లాడిపోయింది. కాఫీ పెట్టే పని ఆపి గబగబా వచ్చి అతణ్ణి గట్టిగా చుట్టేసుకొని కూచుంది. అతడు మౌనంగా ఆమె చేతులను పట్టుకొని ఉండిపోయాడు. పదేళ్లుగా ఆ తండ్రి ఆ కూతురి జీవితానికి అతిథి. వాళ్లిద్దరూ నేరుగా కలవడం అప్పుడప్పుడూ జరిగే పని. అతడు వస్తుంటాడు. సంవత్సరానికి ఒకసారి సెలవులప్పుడు ఆ పిల్ల ఢిల్లీ వెళుతుంటుంది. మిగిలిన సందర్భాల్లో ఉత్తరాలు… వాటి స్థానంలో ఫోన్లు… ఆపైన ఈ మెయిల్సు…. కూతురితో అనుబంధం చెదిరిపోకుండా ఉండేందుకు అతడు అతడితో సంబంధం తెగిపోకుండా ఉండేందుకు ఆ అమ్మాయి అలుపే లేనట్టుగా ప్రయత్నించారు.

తల్లి ఈవిషయం మీద పెద్దగా వ్యాఖ్యానించదు. కాని లోలోపల అదంతా పేరుకుపోయినట్టుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా బయటపడుతుండేది. కూతురు ఏదైనా తప్పుచేసినప్పుడు కూతురి అవసరాలు శక్తికి మించి పోయినప్పుడు ‘ఫో… ఇక నా వల్లకాదు… మీ నాన్న దగ్గరికి వెళ్లు’ అని కసురుకునేది.

ఒక్కోసారి కూతురు కూడా పంతానికి వచ్చి ‘నువ్వేమీ నన్ను చూడక్క ర్లేదులే… నాన్న చూస్తాడులే’ అని గొడవకు దిగేది. అలా అదృశ్యంగా వాళ్ల మధ్య అతడు కదలాడేవాడు. లేడన్న మాటేగాని ఉన్నట్టుగానే ఉండేవాడు. ఆ ధోరణి మరీశృతి మించితే ‘ఛీ… ఎంత తుడిచినా పోని పాడుమరకలా తయారయ్యాడు మీ నాన్న’ అని తల్లి విసుక్కునేది. ఆపైన తట్టుకోలేనంత దుఃఖంతో ఏడ్చేది.

అప్పుడు మాత్రం ఆ అమ్మాయి పెంకితనం మాని తల్లి చెప్పినట్టుగా బుద్ధిగా నడుచుకునేది. తల్లి ఏడవడం కూతురికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఏడెనిమిదేళ్ల వయసులో మొదటిసారి ఆ అమ్మాయి తల్లి ఏడవడం గమనించింది. చిన్నపిల్ల- అర్ధరాత్రి తల్లిదండ్రుల అరుపులకు ఉలిక్కిపడి లేచేది. వాటి తీవ్రతకు భయంతో దిండును కరుచుకుపోయేది. కూతురులేచిందన్న స్పృహ కలిగితే వాళ్ల పోట్లాట ఇంగ్లిషులోకి మారేది తప్ప ఆగేది కాదు. ఆ సమయంలో తల్లిదండ్రుల ముఖాలు చాలా చేదుగా అనిపించేవి. అసహ్యంగా కూడా అనిపించేవి. పోట్లాడి పోట్లాడి తల్లి ఒక్కసారిగా ఏడుపు అందుకునేది. దాంతో తండ్రి మాటలు ఆపి ఏ సోఫాలోనో పడి నిద్రపోయేవాడు.

మరుసటి రోజు… కాకపోతే ఆ మరుసటి రోజు…. మళ్లీ గొడవ. రాత్రయితే చాలు ఆ అమ్మాయికి భయం వేసేది. తల్లి ఏడిస్తే ఆ ఏడుపు దెయ్యంలా పీడకలల్లో వచ్చేది. భయం… నొప్పి…అయితే కాలం గడిచేకొద్దీ ఆ అమ్మాయి ఆ భయాన్ని నొప్పిని పీడకలల రోజులని దాటి వచ్చే ప్రయత్నం చేసింది. కాని – అవన్నీ కలిసి రక్కిపెట్టిన ఆమె గుండె మాత్రం ఇంకా రక్తం ఓడుతూనే ఉంది.

‘నాన్నా… నిన్నో విషయం అడగనా?’ అందా అమ్మాయి ఉన్నట్టుండి అతడి సమీపం నుంచి లేచి కాఫీ పెట్టడానికి వెళుతూ. ‘

పర్సనల్’… అంది మళ్లీ.

‘నువ్వూ… అమ్మా…. ఒకటిగా ఎప్పుడు ఉండేవాళ్లు నాన్నా?’ అంది లోపలికి వెళుతూ.

‘అంటే?’ అన్నాడతను.

‘అదే… గొడవలు లేకుండా…. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ గొడవలే కదా నాన్నా చూశాను’….. అందా అమ్మాయి.

కూతురి వాలకం చూస్తే – మేఘాలు ఏవో చెప్పా పెట్టకుండా కమ్ముకుం టున్నట్టుగా తండ్రికి అనుమానం కలిగింది. అతడు జవాబు వెతుక్కుంటున్న వాడిలా జేబులన్నీ తడుముకుని తెల్లటి కర్చీఫ్ బయటికి తీశాడు. ఆ తర్వాత దానిని ముఖానికి అదుముకొని ఏదో దుమారాన్ని తప్పించుకుంటున్నవాడిలా అలాగే ఉండిపోయాడు.

ఆ దుమారం – ఇవాళ అతడి ఉనికిని కూడా భరించలేకపోతున్న ఆమె జ్ఞాపకాలకు సంబంధించినది. పెద్ద కళ్లద్దాల ఫ్రేము, పొట్టి చేతుల జాకెట్, పూలపూల చీర, పలుచగా ఉండే వొంటితో మెడ్రాస్‌లో ఆమె పరిచయమైన రోజులు అతడికి గుర్తుకొచ్చాయి. ఇద్దరూ పత్రికల్లో ట్రయినింగ్ అవుతున్న రోజులవి. ఇద్దరికీ పుస్తకాలంటే ఇష్టం. ఇద్దరికీ సినిమాలంటే ఇష్టం. ఇద్దరికీ నవ్వుకోవడం అంటే ఇష్టం. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. కాకపోతే ఆమె దడబడమని దుమికే జలపాతంలా హోరుగా ఉండేది. అతడు చెట్లమాటున నిశ్శబ్దంగా దాగిన తటాకంలా ఉండేవాడు.

ఇద్దరూ పాటలకు చెవికోసుకునేవారు. కాని అతడు ఎప్పుడైనా పాడితే ఆమె లయబద్ధం కాని చిటికెలతో అతడికి ఎదురొచ్చేది. ఇద్దరూ వంటచేసేవారు. కాని అతడు చాందసంగా ఇష్టపడే మూడు నాలుగు కూరలను కాదని అమె రకరకాలుగా చేసి అవి తినకపోతే అతడిపై అలిగేది. అతడు నలుగురితో కలవడానికి ఇష్టపడని ముచ్చు. ఆమె ఎదుటపడ్డ ప్రతి ఒక్కరినీ పలకరించే కరచాలనం. వారానికి ఒకసారి దొరికే ఆఫ్ రోజున వాళ్లిద్దరూ మెరీనా బీచ్‌లో ఒడ్డుకు పదేపదే కొట్టుకొచ్చే గవ్వల్లా తుళ్లిపడుతుండేవారు. ఒకరిపై మరొకరి పైచేయి కోసం కెరటాల్లా పెనుగులాడేవాళ్లు. ఉప్పూకారం అద్దుకొనితిన్న అనాసపండు ముక్కలు… తడి ఇసుక మీద పాదముద్రలు పడేలా వేసిన అడుగులు… బీచ్‌లో దొరికే జాజిపూల మూరలు… ఆ మెరుపు… నురగ మీది తళుకు అలా ఉండగానే వాళ్ల ట్రయినింగ్ ముగిసింది.

ఉద్యోగాలకు హైద్రాబాద్ రావడంతోటే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. వంటగదిలో పాలు పొంగి అంతలోనే తగ్గిన చప్పుడు వినిపించింది. కప్పులు మృదువుగా కదలాడాయి. వాటిని తీసి స్టవ్ పక్కన సిద్ధం చేసిన ఆ అమ్మాయి ‘నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు నాన్నా నువ్వు’ అంది లోపలి నుంచి.

తండ్రి- కర్చీఫ్ తొలగించి- ‘తల్లి బుద్ధి’ అనుకున్నాడు. తల్లి కూడా అంతే. అతడు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేసినప్పుడు వాళ్ల మధ్య గొడవ వచ్చి రెండు మూడు రోజులు మాట్లాడుకోనప్పుడు ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేయడానికి అతడే తగ్గి ఏవో మాటలు కలిపేవాడు. ‘సినిమాకు వెళదామా?’ అనేవాడు. రాత్రయ్యాక పక్క మీద ఆమెను దగ్గరికి తీసుకునేవాడు. అంతటితో ఆమె పోట్లాట మాని మామూలు అయిపోవాలనిఅతడి కోరిక. కాని ఆమె అలాంటి మనిషికాదు.లేచి లైటు వేసి ‘మనం కూర్చుని కాసేపు మాట్లాడుకుందాం’ అని అతణ్ణి భయపెట్టేది.

‘పొరపాటు ఎందుకు జరిగింది… ఎలాజరిగింది… అందులో నీ తప్పు ఏమిటి… నా తప్పు ఏమిటి… అదంతా క్లియర్ అయితేనే తర్వాతి సంగతి’ అని పట్టు పట్టేది. అది అతడికి ఇష్టముండదు. తప్పు తనదైనా ఆమెదైనా చర్చలంటే చాలు భీతిల్లేవాడు. ‘అన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో మాట్లాడుకోవాలా… గ్రేలో ఉంచవా’ అనేవాడు. ఆమెవినదు. సమాధానం కావాలి. దోషి తేలాలి.

‘నాన్నా… ఉన్నావా?’ అందా అమ్మాయి వదలకుండా.

‘ఏం చెప్పమంటావు అమ్మా’ అన్నాడతను ఏం చెప్పాలో తెలియక.

‘ఏదో ఒకటి చెప్పు… మీ ఇద్దరూ క్లోజ్‌గా ఎప్పుడూ లేరా?’

‘ఎందుకు లేము తల్లీ. చాలా క్లోజ్‌గా ఉన్నాం. పెళ్లికి ముందు… పెళ్లయిన తర్వాత… మీ అమ్మ నిన్ను గర్భాన మోస్తున్నప్పుడు… ఎంతో అపురూపంగా ఉన్నాం. కాని నువ్వు పుట్టిన తర్వాత నీ ఆరోగ్యం బాగలేనప్పుడు మాత్రమే మళ్లీ అంత క్లోజ్ అయ్యేవాళ్లం. చిన్నప్పుడు నీకు తరచూ జ్వరం వచ్చేది. చలికాలం వస్తే ఆస్తమా తిరగబెట్టేది. అప్పుడు అర్ధరాత్రిళ్లు అపరాత్రిళ్లు లేచి చంక దిగకుండా ఏడుస్తూ ఉండేదానివి. ఆ టైమ్‌లో మేము కిందా మీదా అయిపోయేవాళ్లం. మా పోట్లాటలన్నీమాని ఒక్కటిగా నిన్ను చూసుకునేవాళ్లం. నిజంగా ఆ సమయంలో మేమిద్దరం ఎంతోప్రేమగా మారిపోయేవాళ్లం. నీ గురించి కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుకునేవాళ్లం.

నీకు కష్టం వచ్చిందంటే చాలు మా మధ్య వైరం పోయేదమ్మా….’

‘కష్టమంటే మీ దృష్టిలో ఏమిటి నాన్నా?’

‘ఏమడుగుతున్నావమ్మా?…’ అన్నాడతను అయోమయంగా.

‘మీరు విడిపోతే నా మనసుకు కష్టమొస్తుందని అనుకోలేదా మీరిద్దరూ?…’ ఆ మాట అంటున్నప్పుడు ఆ అమ్మాయి ముఖం తండ్రికి కనబడలేదు. కాని అందులోని గాఢతకు గుండెల్లో ద్రావకం దిగినట్టనిపించింది.

‘అలా మాట్లాడకు పాపా’ అన్నాడు.

ఆ అమ్మాయి సంభాషణ పొడిగించకుండా ట్రేలో కాఫీ తెచ్చి అతడికిచ్చి తను తీసుకుంది. ఇద్దరూ పట్టుకొని కూర్చున్నారు తప్ప తాగలేదు. వాళ్లు నోటితో కాకుండా పాదాలతో మాట్లాడుకుంటున్నారా అన్నట్టుగా గచ్చు మీద కాళ్లు అస్తిమితంగా కదులుతున్నాయి. ఆ అమ్మాయి ఉన్నట్టుండి లేచి ‘అలా టై మీదకెళదామా నాన్నా’ అంది. అతడు ‘ఊ’ అని లేవబోయి ఎందుకనో తత్తరపడ్డాడు.

ఆ అమ్మాయి కాఫీ కప్పుతోపాటు బయటకు వచ్చి ఇంటికి తాళం వేసింది. ‘ఇంకో తాళం అమ్మ దగ్గర ఉంటుంది…. రా.. నాన్నా’ అని లిఫ్ట్ వైపు నడిచింది. సారథి స్టూడియోస్ వెనుక వరుసగా పాతేసిన కొయ్యల్లా కట్టిన అపార్ట్ మెంట్లు అవి. పది పదిహేనేళ్ల క్రితం నాటి ఎగుడుదిగుడు టై మీద చెత్త పేరుకొని ఉంది. మరో ఫ్లోర్ వేయడానికి వదిలిపెట్టిన ఇనుపచువ్వలు… పైకి లేచిన దుమ్ము… చంద్రుడు కనిపించనివ్వని అమీర్ పేట వాహనాల పొగ…. మసక.

అయినా – ఆ అమ్మాయికి అప్పుడప్పుడు అక్కడకు వచ్చి ఒంటరిగా నిలబడటం ఇష్టం. తండ్రిని తలుచుకోవడం ఇష్టం. తనలో తాను ఏడవడమూ ఇష్టం. ఇలాంటి ఒక చలికాలపు సాయంత్రమే బాల్యంలో అతడు ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్లాడు. ఆ రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అతడు లగేజ్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆమె రావడం రావడం ఎత్తుకొని గుండెలకు గట్టిగా హత్తుకొని ఐస్‌క్రీమ్ తినిపించడానికి తీసుకువెళ్లాడు. ఆ పిల్ల ఆదమరుపుగాఐస్‌క్రీమ్ తింటూ ఉండగా ‘నాకు ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది పాపా’ అన్నాడు. ఆ మాటకు ఏదో అర్థమయ్యి టక్కునస్పూన్ పక్కన పడేసి ఆ పిల్ల ఏడుపు అందుకుంది.

‘ఛ.. ఛ.. ఏడవకమ్మా. అక్కడకు వెళ్లాక త్వరలోనే నిన్నూ అమ్మనూ తీసుకువెళతానుగా. ప్రామిస్ తల్లీ’ అన్నాడతను. కాని – అది నెరవేరని ప్రామిస్ అని ఎదిగే కొద్దీ ఆ అమ్మాయికి అర్థమ య్యింది. అయితే ఎప్పుడూ సంజాయిషీ అడగలేదు. అతడు ఇవ్వలేదు. ఇవ్వాళ్టి వరకూ.

‘నేను నిన్ను వదులుకోలేదమ్మా’ అన్నాడతను ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా.

‘మీ అమ్మ మొండిది. మేము ఒకరికొకరం వద్దు అనుకున్నాక కూడా చాలా విషయాల గురించి చాలాసేపు వాదించుకున్నాం… ఒక్క నీ సంగతి తప్ప. పాప విషయంలో పట్టుబట్టావో ఒక్క నిమిషంలో ప్రాణాలొదిలేస్తాను అంది మీ అమ్మ. నేను మాట్లాడలేదు. అలాగే తను కూడా మన మధ్య అడ్డం రాలేదు. మేము లీగల్‌గా ప్రొసీడ్ అయ్యింది లేదు. నలుగురి ఎదుట పంచాయితీ పెట్టిందీ లేదు. జస్ట్… అలా దూరమైపోయాం’ అన్నాడతను.

ముఖాలు కనిపించీ కనిపించని వెలుతురులో పిట్టగోడను ఆనుకొని నిలుచుని ఉన్నారు వాళ్లు. ఎవరూ ఎవరినీ చూసుకోవడం లేదు. కాని ప్రతి మాటనూ దాని ఉఛ్వాస నిశ్వాసలతో తీసుకుంటూ ఉన్నారు.

‘ఎందుకని నాన్నా?’ అందా అమ్మాయి.

‘చాలా కారణాలు ఉంటాయమ్మా. నిజానికి భార్యాభర్తల గొడవల మధ్య ఎందుకు అనే ప్రశ్నకు పెద్దగా విలువ ఉండదు. నన్నడగితే నేనొక వెర్షన్ చెబుతాను. మీ అమ్మను అడిగితే దానికి పూర్తి భిన్నమైన మరో వెర్షన్ చెబుతుంది. ఎవరిది వారికి కరెక్ట్. నేను అనుకోలేదమ్మా… బహుశా మీఅమ్మ కూడా అనుకొని ఉండదు. మా ఇద్దరికీ ఒకరికొకరం ఎంత ఇష్టమంటే… ఒకసారి… మద్రాసులో మంచి ఎండాకాలం… అర్ధరాత్రి నన్ను చూడటానికి మీ అమ్మ మా మాన్షన్‌కు నడుచుకుంటూ వచ్చేసింది.

ఎందుకు-అనంటే గుర్తొచ్చావ్… చూడాలనిపిం చింది అంది. ఆ గొడవకు రూమ్మేట్లు లేచి కూర్చున్నారు. ఏం చేయాలి? ఆ రాత్రంతా సెంట్రల్‌లో కూర్చుని వచ్చి పోయే రైళ్ల మధ్యలోనే బోలెడన్ని మాటలు చెప్పుకున్నాం. అన్నీ అర్థం పర్థం లేనిమాటలు… కాని వాటిలో చాలా తీపి ఉండేదమ్మా…’ అని ఆగాడతను.

‘కాని పెళ్లయిన తర్వాత ఈ తీపి అంతా చేదుగా మారిపోయింది. పెళ్లికి ముందు మాలో పరస్పరం నచ్చిన విషయాలే పెళ్లయిన తర్వాత నచ్చడం మానేశాయి. అవే విషయాలు లోపాలుగా మారి భూతద్దంలో వచ్చి నిలబడ్డాయి. ప్రాబ్లం ఏమిటంటే వియ్ ఆర్ మోర్ క్రిటికల్ టు ఈచ్ అదర్.

మీ అమ్మ అద్దం ముందు నిలబడితే నేను కనపడాలి అనుకునేది. నేను నిలబడితే నీడ మీ అమ్మది పడాలి అని నేను అనుకునేవాణ్ణి. సాధారణంగా ప్రతి మొగుడూ పెళ్లాలు కొంత ప్రయత్నించి వదిలేస్తారు. మేము మాత్రం తెగే దాకా లాగాం’

‘సిల్లీ రీజన్స్ చెబుతున్నావ్ నాన్నా’

‘నో..నో.. ఇవి సిల్లీ రీజన్స్ కావు తల్లీ. హృదయానికీ ఫీలింగ్స్‌కీ సంబంధించినవి. ఎదుటివారి సెన్సిటివిటీస్‌ని పట్టించుకోకపోతే ఏమవుతుందో చెబుతాను విను. ఒకసారి మా కామన్‌ఫ్రెండ్ ఒకమ్మాయి సూసైడ్ చేసుకుంది. తను మీ అమ్మకు క్లాస్‌మేట్… చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరం ఎంతో బాధపడ్డాం. స్నేహితురాలు చనిపోతే బాధపడమా? కాని మీ అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఇంట్లో స్తబ్దుగా ఉండిపోయింది. ఆరోజు రాత్రి నేను వెళ్లి… అలాగే ఉంటే ఏమైపో తుందోనని… క్యాజువల్‌గా డిన్నర్‌కి పిలిచాను. అది తప్పా? మీ అమ్మకు ఎంతకోపం వచ్చిందంటే మూడు నెలలు నాతోమాట్లాడలేదు.

నా స్నేహితురాలు చనిపోయి బాధలో ఉంటే నా ఫీలింగ్స్ పట్టకుండాప్రవర్తిస్తావా అని ఆమె కోపం. నేనేం అంతపెద్ద నేరం చేశానని నా కోపం. అది కాపురమా తల్లీ… సంతోషం అనేదే ఎరగని నీచమైన జీవితం…’

‘మరి ఎందుకు నాన్నా… అమ్మను పట్టుకొని వేలాడుతున్నావు’

‘నిన్ను కన్నది కదమ్మా. కృతజ్ఞత’ ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు.

సంభాషణలోని పాజ్‌ని పూడ్చడాని కన్నట్టుగా వాళ్ల చేతుల్లోని కప్పు సాసర్లు ఉండి ఉండి చప్పుడు చేస్తున్నాయి.

‘ఇప్పుడు ఏమీ లాభం లేదు నాన్నా. నువ్వు లేకుండా అమ్మ ఎలా జీవించిందో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. నన్ను ఎలా పెంచిందో… మేమిద్దరం ఎండనూ… వాననూ… కష్టాన్ని తట్టుకొని ఎలానిలబడ్డామో నీ ఊహకు కూడా అందదు. నీకు తెలుసా నాన్నా… నా చిన్నప్పుడు అమ్మ తన ఒంటి మీద బట్టలు సరిగా ఉన్నాయోలేదో చూసుకునేది కాదుగానీ ఇంటికి గడియపెట్టానో లేదో అని ఎన్నిసార్లు చూసుకునేదో? అబ్సెసివ్ డిజార్డర్ అంటారే… అలా వచ్చేసింది.

ఇద్దరమే బిక్కుబిక్కుమంటున్న ఇంట్లో అమ్మ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి వెళ్లి గడియ చెక్ చేసుకొని వచ్చేది. గంట గంటకీ లేచేది. కాలం అమ్మ మనసును రాయి చేసిపెట్టింది నాన్నా. నువ్వు ఇప్పటికే ఇంకొకరిని చూసుకొని ఉంటే బాగుండేది…’

‘మీ అమ్మ ఇంకొకరిని చూసుకుందా అమ్మా?’

‘లేదు’

‘మరి?’ అన్నాడతను. ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో తెలియలేదు.

‘నాకు తెలుసు తల్లీ. మా ఇద్దరికీ ఆ పనికుదరదు. ఎందుకో తెలుసా? మా కాలంవేరు. మా ఆలోచనలు వేరు. సిద్ధాంతాలు పుస్తకాలు ఉద్యమాలు… ఇవే లోకంగా బతికిన మేము, పత్రికలలో పని చేస్తే మనుషులకు ఏదైనా మేలు చేయవచ్చు అని నమ్మి కెరీర్‌ని ఎంచుకున్న మేము… ఇన్ని తెలిసీ ఒకరి పట్ల మరొకరం ఇంత దరిద్రంగా బిహేవ్ చేశాం. ఒకరినొకరం అవమానించుకున్నాం. ఇక మామూలు మనుషులు మమ్మల్ని తట్టుకోగలరా అమ్మా’ అన్నాడతను.

‘ముప్ఫయి ఏళ్లకే కారు ముప్ఫయి ఐదుకు టూ బెడ్‌రూమ్ ఫ్లాట్ మధ్యలో ఒకసారి అమెరికా షేర్లు రియల్ ఎస్టేట్ అంటూ డబ్బు మార్కెట్ తప్ప మరొకటి కనిపించని ఈ రోజుల్లో సెక్స్‌ను పంచుకోవడానికి మనుషులు దొరుకుతారేమోగానీ సంతోషం పంచుకోవడానికి చాలా తక్కువమంది దొరుకుతారమ్మా.

అది వారి తప్పు కాదు. మా వెనుకబాటుతనం. కోరికలు చేరిన కిక్కిరిసిన ట్రైనులో లోపలికి దూరలేక బయటే ఆగిపోలేక డోరు పట్టుకుని వేలాడే మనుషుల్లా తయారయ్యాం మేము. మాలాంటివాళ్లకు సరైన తోడు దొరకడం కూడా కష్టమే తల్లీ’…… అని ముగించాడతను.

ఆ అమ్మాయి అటూ ఇటూ పచార్లు చేసింది. తండ్రి – సంధికి వచ్చిన వాడిలా తెల్లవస్త్రం పట్టుకొని ఊపుతున్నాడు. కాని అతడికి ఏమి కావాలి? ఆమెలో తెలియని యాంగ్జయిటీ ప్రవేశించింది. ఇంతకు ముందు వాళ్లిద్దరి మధ్య ఎన్నో క్యాజువల్ సంభాషణలు నడిచాయి. కాని ఇవాళ్టి సంభాషణ మాత్రం నడిమధ్యనే ఉండిపోక ఏదో ఒక వొడ్డుకు తీసుకువెళుతుందన్న ఆశ ఆమెలో చిగురించింది.

‘మరి… నువ్వు… అమ్మను ఇంకా కోరుకుంటున్నావా నాన్నా?’ అందా అమ్మాయి.

అతను వెంటనే జవాబు ఇవ్వలేదు. కాసేపటికి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడా అని కూతురికి అనిపించింది. ‘నాన్నా… నాన్నా’ కూతురి కళ్లల్లో నీళ్లు ఎగజిమ్మాయి.

అతడు అదుపులోకి వచ్చి ‘అమ్మ నన్ను ఇంకా ద్వేషిస్తూనే ఉందా తల్లీ’ అన్నాడు.

‘తెలియదు నాన్నా. కాని నువ్వు వచ్చివెళ్లిన రెండు మూడు రోజుల పాటు అమ్మమామూలు మనిషి కాదు. చాలా మూడీగా మారిపోతుంది. చిరాగ్గా ఉంటుంది. గదిలో తలుపు వేసుకొని పడుకుంటుంది. డిస్ట్రబ్ అవుతుంది. ఆ తర్వాత మూడ్‌బాగున్నప్పుడు ‘ఏమన్నాడు మీ నాన్న?’ అనిగుచ్చి గుచ్చి అడుగుతుంది. మరీ మూడ్ బాగుంటే ఆ పొట్ట ఏమిటే అంత పెంచాడు అని నవ్వుతుంది’ అతడు నవ్వే ప్రయత్నం చేశాడు.

ఆ తర్వాత ఆగి – ‘నాలోని ఒక వంతుమీ అమ్మను గాఢంగా కోరుకుం టోందమ్మా. ఒక వంతే’ అన్నాడు. ‘నిజానికి మీ అమ్మ ఎంతో మంచిది. ఎవరికైనా కష్టం వస్తే చూడలేదు. నష్టం జరిగితే అడ్డుకోకుండా ఉండలేదు. అసలు ఆమె ప్రెజెన్సే గొప్ప ఉత్సాహం. ఆత్మవిశ్వాసంతో రెక్కలు విప్పుతున్న ఒక తరం మధ్యతరగతి ఆడపిల్లలకు ప్రతినిధి మీ అమ్మ. ఆ ఆత్మవిశ్వాసమే నన్ను ఆకర్షించింది. బహుశా ఆ ఆత్మవిశ్వాసమే ఆమెను సరిగా హ్యాండిల్ చేయడంలో నన్ను విఫలం చేసింది.

మేమిద్దరం సంతోషంగా సంతృప్తిగా గడిపిన రోజులు కచ్చితంగా ఉన్నాయి. అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు – అలా రెప్పలు మూసుకుంటే సన్నటి పెదాలతో నవ్వే మీ అమ్మ గుర్తుకొచ్చినప్పుడు ఉదయాన్నే ఫోను పట్టుకొని హడావిడిపడుతూ నన్ను లేపి టీ ఇచ్చే మీ అమ్మ రూపాన్ని తలుచుకున్నప్పుడు మీ అమ్మ మీద ఎంతో ఇష్టం పెరుగుతుంది. వెంటనే బయలుదేరి వచ్చేసి ఆమెతో ఉండాలనిఅనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఆ సంగతి చెప్దామనే ఇక్కడికి వస్తాను. కాని మీ అమ్మముఖం చూడగానే అన్నీ మర్చిపోయి కోపం వచ్చి వెళ్లిపోతాను.

వాస్తవానికి ఇదంతా పెద్దహింసమ్మా. ప్లేట్లెట్స్ కౌంట్ పూర్తిగా పడిపోతేనే చావు సంభవిస్తుంది. ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉంటే ఒక వంతు కావాలి అని మూడు వంతులు వద్దూ అనిపిస్తూ ఉంటుంది. పెళ్లిలో సుఖం ఉందని చెప్పను. కాని ఇలా విడిపోయి జీవించడంలో ఆనందం లేదని మాత్రం చెప్పగలను… ముఖ్యంగా పిల్లలు పుట్టాక.

నీకు తెలుసా తల్లీ… నేను హాయిగా నిద్రపోయి యుగాలు అవుతోందమ్మా’ అన్నాడతను.

ఆ మాట అంటున్నప్పుడు అతడు కూతురికి బాగా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. దీర్ఘకాలంగా నొప్పి అనుభవిస్తున్న పేషెంట్ ఆసరా కోసం నిలబడినట్టుగా నిలబడ్డాడు.

‘అమ్మ పరిస్థితి కూడా ఇదేనేమో నాన్నా’ అందా అమ్మాయి.

‘అయి ఉండవచ్చు తల్లీ’ అన్నాడతను.

ఆ తర్వాత అంచనా వేస్తున్నట్టుగా మాట్లాడాడు.

‘ద్వేషం కరడుగడితే ఎవర్ని ద్వేషిస్తున్నామో వాళ్లు ఇమ్మెటీరియల్ అయిపోతారమ్మా. అప్పుడు వాళ్లు ఎదుటపడినా- ఏ కుర్చీనో టేబుల్‌నో ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేసి టీయో కాఫీయో ఇచ్చి పంపించేస్తాం. కాని మీ అమ్మ నన్ను చూసి డిస్ట్రబ్ అవుతోందంటే ఆమెలోని ఒక వంతు కూడా ఇంకా పచ్చగానే ఉండొచ్చమ్మా’ అన్నాడు.

వాళ్లిద్దరూ మౌనంగా ఉండిపోయారు.హఠాత్తుగా ఆ అమ్మాయి ‘నేను అమ్మతో మాట్లాడనా నాన్నా?’ అంది.

‘కష్టం తల్లీ’ అన్నాడతను.

‘లేదు నాన్నా.. ప్రయత్నిద్దాం. నాకు నమ్మకం ఉంది’ అతడు ఉద్వేగంతో ఆ అమ్మాయిని హత్తుకున్నాడు. వాళ్లు మెట్లు దిగి ఫ్లాట్‌కు చేరుకుని తలుపు తీశారు. ఆ అమ్మాయి టీపాయ్ మీద పడున్న పూలని గబగబా ఫ్లవర్‌వాజ్‌లో అమర్చి సాధారణంగా తల్లి రావడంతోటే చికాకుపడేలా ఉండే వస్తువులన్నీ సర్దింది.అతడు పొట్టను వీలైనంత లోపలికి అదుముకొని టక్ సరి చేసుకున్నాడు.

ఆమె వచ్చే వేళయింది.

Was this helpful?

About Author /

కథ మరియు నవలా రచయిత, కాలమిస్ట్

Leave a Comment

Your email address will not be published.

Thanks for submitting your comment!

Start typing and press Enter to search

Share This