ఏ తీగ పువ్వునో- కేరాఫ్ కావలి (C/o. కంచెర పాలెం) – ఖదీర్

c/o kancharapalem Archives - ActionCutOk
  • Facebook
  • Twitter
  • reddit

మా నాన్నకు రేడియో మీద ధ్యాస లేదు. మద్రాసు నుంచి మంచి గోడ గడియారం తెచ్చి (40 ఏళ్లుగా ఇప్పటికీ మా ఇంట్లో ఉంది) బిగించాడు కానీ రేడియో తేలేదు. ఉన్న రేడియో నాసీరకందే. పొద్దున్నే పాటలు పాడేది. మా అమ్మ టీ చేసి, స్టీలు చెంబులో వడగట్టి, చక్కెర కలవడానికి స్పూన్‌తో గంట కొట్టినట్టు టంగుటంగుమని తిప్పుతూ ఉంటే ఆ శబ్దానికి లేచేవాణ్ణి. మాది పాలు తాగి పెరిగే పిల్లలు ఉన్న ఇల్లు కాదు. టీ తాగి పెరిగే ఇల్లు. ‘విద్యానికేతన్’లో ఆరూ ఏడు క్లాసులకు యూనిఫామ్ లేదు. తాటాకు కొట్టం గదిలో క్లాసులు జరిగి మధ్యాహ్నం ఇంటర్వెల్ తర్వాత లాస్టు పిరీడు ఆటపాటలకు ఉండేది. మట్టిని బిగించి పట్టుకొని కొద్దిగా పైకి తేలిన రాళ్ల గ్రౌండులో పిల్లలందరూ కూచుంటే కళలు తెలిసిన పిల్లలు రంగంలో దిగి ఎంటర్‌టైన్ చేయాల్సి వచ్చేది.

అప్పుడు పాడేవాణ్ణి.ఏ తీగపువ్వునో ఏ కొమ్మ తేటినో.. ఆ ‘తేటినో’ అంటే ఏమిటో అప్పటికీ తెలియదు. ఇప్పటికీ తెలియదు.రేడియోలో ప్రతి రెండో రోజూ ఈ పాటే వచ్చేది. అందుకని ఈ పాట పాడటం తెలిసింది. పిల్లలు నవ్వేవాళ్లు కాదుగాని బంగారం కొట్టు నడిపే మా తాత కాసింత వినోదం కావాల్సి వచ్చినప్పుడు నా చేత ఆ పాట పాడించుకుని పట్టలేనట్టుగా నవ్వి పెద్దసైజు రూపాయి కాసు ఇచ్చేవాడు.

క్లాసులో సింగుల అమ్మాయి ఒకమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని చూసేవాణ్ణి. ఆకర్షణ లేదుగాని క్లాసులో మీనాక్షి అని ఒక పెద్ద కళ్ల అమ్మాయి పెద్ద గొంతుతో మాట్లాడి మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉండేది. చూసేవాణ్ణి. గోదాలక్ష్మికి చీమిడి కారేది. అక్కర్లేదు. ఒక క్లాసు తక్కువగా సత్యవాణి అని తీర్చిదిద్దినట్టు ఉండే వంక పెట్టడానికి వీల్లేకుండా ఉండే అమ్మాయి ఉండేది. చూసేవాణ్ణి. వాళ్ల జామెట్రీ బాక్సులు, ఒకటి రెండు వేసుకున్న పలుచటి గాజుల చేతులు, జడను యూ టర్న్ కొట్టించి పైకి తెచ్చి రిబ్బన్‌తో వేసిన ముడులు, మోకాళ్ల వరకూ గౌన్‌లు, కింద పట్టీని ఊడగొట్టి పొడవు పెంచడం వల్ల ఆ పట్టీ మాత్రమే కొత్తగా ఉండే గౌన్‌లు, రీసెస్ రూముకు వెళ్లి ఏమీ ఎరగనట్టుగా వచ్చే వాళ్ల నడక…

జీవుడు చైతన్యంలోకి వచ్చాక తొలి ఊపిరి నుంచే చేతన మొదలయ్యాక సంవేదనలు ఫలానా వయసు నుంచే ఉండాలని నియమమా ఏమి? ఏ వయసులో ఏమేమి జరుగుతుందో ఏమేమి అనిపిస్తుందో మానవజాతి ఏ మాత్రం మాట్లాడుకుంది గనగ.. తెర మీద ఏ మాత్రం చూపించింది గనక.

‘కేరాఫ్ కంచరపాలెం’లో వాన కురసే ఉదయాన తల మీద తాటాకు కప్పుకుని వీధి చివర ఆ క్లాస్‌మేట్ అమ్మాయి కోసం ఆరాధనగా వెయిట్ చేసిన స్కూల్ కుర్రాడు నాకు నచ్చాడు. ఆ అమ్మాయికి కూడా వాడు నచ్చినట్టే ఉన్నాడు. ‘అబ్బాయ్’.. ‘అబ్బాయ్’ అని పిలుస్తుంది వాణ్ణి. వాడి ఎంకరేజ్‌మెంట్ వల్ల స్కూల్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ‘మరో చరిత్ర’ నుంచి, అవును మరో చరిత్ర నుంచే ‘భలే భలే మగాడివోయ్ బంగారు నా స్వామివోయ్’ పాట పాడుతుంది.

కాని ఆ స్నేహం నిలవదు. కొనసాగదు. అబరప్ట్‌గా అంతమైపోతుంది. దాటి వచ్చి చాలాకాలం అయిపోయినా సరే ఒకో జ్ఞాపకం, మెదడు నిక్షిప్తం చేసుకున్న ఇష్టమైన సందూక ఎక్కడికీ పోదు. తాళం వేసి ఉన్న ఆ అమ్మాయి ఇంటి ముందు ఆ పిల్లాడు ఆశగా తిరుగుతున్న ప్రతిసారీ కలుక్కుమంది. ఆ అమ్మాయి వస్తే బాగుండు అనిపించింది. అంతేనా. దేవుడు తనని మోసం చేశాడని వాడు అనుకుంటే దేవుడికి ఎంత పెద్ద అపకారం తలపెడతాడో అని భయం వేసింది.

కేరాఫ్ కంచరపాలెం కొన్ని ఇష్టమైన స్ట్రింగ్స్‌ని కంపింపచేసింది. ఒక షాట్‌లో ‘ఎక్కడిదీ ఈ వీణ’ పాట లేశమాత్రం వినిపిస్తుంది. ప్రాణం లేచి వస్తుంది. ఊరి స్నేహితులు అర్ధరాత్రి మందుకొట్టి అప్పట్లో పాపులర్ అయిన హిందీ పాట ‘తోఫా తోఫా తోఫా లాయా లాయా’కు దేశీయ తెలుగు వర్షన్ పాడుకుంటే ఒకరితో పంచుకోవడానికి వీల్లేని సొంత ఆనందం కలిగింది.

వినాయకుడి బొమ్మ చేసిన ఆ నత్తి ఆర్టిస్టు బొమ్మ పూర్తయిన ఆనందంలో సంతృప్తిలో విశ్రాంతికి ఉపకరిస్తూ భార్య చేయి పట్టుకుని లాగుతాడు. అలసిపోయిన భర్తకు విశ్రాంతి కోసం ఇప్పుడు కాదు.. పడుకో అని ఆమె అంటుంది. ఆ పాత్ర ముగిసిపోతే అంతకు ముందురోజు రాత్రి అతడు పొందలేకపోయిన ఆ చిన్న ఆనందం ఎందుకనో గుర్తుండిపోయింది, బాధతో.

ముఖానికి చున్నీ కట్టుకుని కాదు, వంటి నిండా బురాఖా వేసుకొని తిరుపతి రామ్‌రాజ్ థియేటర్ దగ్గర విటునితో మాటలు కలపడానికి ఆశపడిన సలీమాను చూశాను. తండ్రి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే చూపించినవాణ్ణి కట్టుకుని తిరస్కారంతో జీవితాన్ని ఆహ్వానించే ఆ డాన్సర్ అమ్మాయి లాంటి పాత్రలను నిత్యం చూస్తూనే ఉన్నాను.

‘సలాం బాంబే’ గుర్తొచ్చింది. ‘కళ్లు’ సినిమా గుర్తుకొచ్చింది. నగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’ గుర్తుకొచ్చింది. ఇట్లాంటి కథలు తెలుగు సాహిత్యంలో చాలా ఉన్నాయి. రాశాం. తెర మీద రాసినట్టుగా చూడటం తెలుగు జీవితం తెలుగు జీవితంలా చూడటం ‘కేరాఫ్ కంచరపాలెం’ వల్ల సాధ్యమైంది.

ఈ డెరైక్టర్ ఎవరో. ‘టచ్ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్’… లాంటి సినిమాలు ఉంటాయి. ఉండాలి. వాటిని తీసేవారిని అలా ఉండనిచ్చి వీటిని తీసేవాళ్లను తియ్యరా అబ్బాయి అని చెప్పగలగాలి. అందుకు ఏం చేయలి? సినిమా చూడాలి. నేను నిన్న చూశాను. రేపు మళ్లీ వెళ్లాలనుకుంటున్నాను. కంచరపాలెం రైల్వేగేటు దగ్గర ప్రియురాలి కోసం దెబ్బలు తింటున్న రాజుగాణ్ణి కాపాడే గ్యాంగులో ఉంటాను. వచ్చి కలవండి.

Was this helpful?

About Author /

కథ మరియు నవలా రచయిత, కాలమిస్ట్

Leave a Comment

Your email address will not be published.

Thanks for submitting your comment!

Start typing and press Enter to search

Share This