వండర్ ఉమన్ (1984) – రివ్యూ
వండర్ వుమన్, డయానా ప్రిన్స్ అనే DC యొక్క ప్రధాన కామిక్ పాత్రలలో చాలా డైనమిక్ అయినటువంటి ఈ పాత్ర తో కూడిన సినిమా వస్తుందంటే అందరికీ ఒకరకమయిన ఉత్సాహం కలుగుతుంది. ఇందుకు కారణం ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన మొదటి చిత్రం అందరినీ అలరించడమే.. అందువలన తరువాత వచ్చే సీక్వెల్ అంతకుమించి ఉంటుందని ఆశించడం సహజం. కానీ ఆ ఆశలను వండర్ వుమన్ 1984 మీకు దూరం చేసిందని ఈ సినిమా చూసేవరకు మనకి తెలియదు. ఎందుకంటే చివరి సంవత్సరం విడులయిన మొదటి ట్రైలర్ తరువాత వచ్చిన రెండవ ట్రైలర్ కూడా సినిమా పై విపరీతమయిన ఆసక్తిని రేకెత్తించాయి.
వండర్ వుమన్ మొదటి చిత్రం WWI-బ్యాక్‌డ్రాప్ లో నడపబడి సీక్వెల్ లో ఐరోపా నుండి 1980 ల ప్రారంభంలో వాషింగ్టన్, డి.సి.కి గణనీయమైన దూకుడుతో మొదలయ్యే కథ అసలు అన్నీ పాత్రలను ఇంట్రడ్యూస్ చేసి కథ లో సెటిల్ కావడానికి దాదాపు 70 నిమిషాలు పోరాడవలసి వచ్చింది. ఫ్రాంచైజ్ యొక్క మొదటి సినిమా లో మెరిసినవన్నీ వండర్ వుమన్ 1984 లో పోయాయి. మొత్తం గా నిరాశపరిచే ఈ సీక్వెల్ చలనచిత్రంలో సూపర్ హీరో లైవ్-యాక్షన్ చిత్రీకరించిన విధానం మొత్తం హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ యొక్క భయంకరమైన స్థితిని హైలైట్ చేస్తుంది.
అద్భుతమైన తారాగణం, హాన్స్ జిమ్మర్ సంగీతం, కరోనా టైములో వస్తున్న మొట్టమొదటి సూపర్ హీరో చిత్రం.. దీనికి ఆకర్షణీయమైన గాల్ గాడాట్ అభినయం.. ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెల్ కోసం కావలసిన అంశాలు దాదాపు ప్రతిదీ కలిగి ఉంది. దానికి తోడు సమయం-దాటవేసే (టైమ్ స్కిప్పింగ్) కథ, మరియు 1984 వింటేజ్ బ్యాక్ డ్రాప్ ని అందించడం ద్వారా ఉత్సాహంగా ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాకు ఎంచుకున్న కథ పరిపూర్ణంగా లేదు; పేలవమైన విలన్లు, జాతి వైవిధ్యం మరియు ఒరిజినల్ DC కామిక్ కథ కు దూరంగా ఉండడం, 1984 వ సంవత్సరం కు సంబంధించిన ఆకర్షణీయమైన అంశాలేవీ లేకపోవడం, అసలు 1984 బ్యాక్‌డ్రాప్ అవసరమేమిటి అన్న ప్రశ్న చూసేవారందరికీ కలుగుతుంది.
పాటీ జెంకిన్స్ దర్శకత్వం లో వచ్చిన ఈ కథ , 1984 వ దశకంలో, డయానా (గాల్ గాడోట్) స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ మానవ శాస్త్రవేత్తగా పనిచేస్తోంది. మ్యూజియం క్యూరేటర్ మరియు అండర్ కవర్ సూపర్ హీరో గా ఉంటున్న డయానా కొన్ని పరిస్థితుల ద్వారా బార్బరా మినర్వా (క్రిస్టెన్ విగ్) అనే సహోద్యోగితో స్నేహాన్ని పెంచుకోవడం ప్రారంభించగానే, డయానా జీవితం లో ఒక మేజిక్ రాక్ అంతరాయం కలిగిస్తుంది. ఆయిల్ టైకూన్ కావాలనే కోరికతో రగులుతున్న మాక్స్వెల్ లార్డ్ (పెడ్రో పాస్కల్) కథలోకి అడుగుపెట్టినప్పుడు కథ లోని విషయాలు మలుపు తిరుగుతాయి. బార్బరా మరియు మాక్స్వెల్ అనుబంధం బార్బరా ని విలన్‌గా చాలా త్వరగా మారుస్తుంది. ఇంతలో, మేజిక్ రాక్ ప్రధాన ప్రపంచ అశాంతికి (మరియు మధ్యప్రాచ్య రాజకీయాల యొక్క విచిత్రమైన అకౌంటింగ్) వేదికగా నిలుస్తుంది. మొదట, ఇది తెలియకుండానే డయానాకు స్టీవ్ ట్రెవర్ (క్రిస్ పైన్) తిరిగి జీవితంలోకి రావడం అనే గొప్ప కోరికను ఆమె కు ఇస్తుంది. ఇది కోరికలను ఇస్తుంది, కానీ కీలకమైనదాన్ని కూడా తిరిగి తీసుకుంటుంది. డయానా స్టీవ్‌ను తిరిగి పొందడంతో, ఆమె శక్తులు కనుమరుగవుతాయి.
మాక్స్వెల్ చివరికి డ్రీమ్స్టోన్ను సొంతం చేసుకుంటాడు మరియు స్వయంగా అందరి కోరికలు తీర్చడం ప్రారంభిస్తాడు. అతను కూడా ప్రభావవంతమైన వ్యాపారవేత్త అవుతాడు, కాని వయస్సు మీరడం మరియు కృశించడం ప్రారంభిస్తాడు. ఇతరుల ప్రాణశక్తిని పీల్చుకోవడం ద్వారా అతను దీనిని ఎదుర్కుంటాడు. బార్బరా మరియు మాక్స్వెల్ వారికి కొత్తగా వచ్చిన శక్తులను ఎక్కువగా ప్రేమిస్తున్నందున డయానా మాక్స్‌వెల్‌కు హాని కలిగించకుండా బార్బరా చీతా గా మారడం ద్వారా ఎదురుకుంటుంది. అయితే స్టీవ్ ని త్యాగం చేయడం ద్వారా డయానా తన శక్తులను తిరిగి పొంది బార్బరాని చిత్తు చేస్తుంది. అయితే తాను సంతరించుకున్న శక్తితో మాక్స్వెల్ అమెరికా కి అణ్వాయుధాలు అందించడమే కాక రష్యా అమెరికా మధ్య యుధ్ధానికి తెరలేపుతాడు. అంతే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ బ్రాడ్ కాస్టింగ్ పరిజ్ఞానం ద్వారా వారి కోరికలను తీర్చి అందుకు బదులుగా వారి యవ్వనాన్ని తీసుకుంటుంటాడు మాక్స్వెల్. అయితే దీనిని డయానా ఎలా ఎదుర్కొంది అనేది ఈ సినిమా క్లైమాక్స్.
కథ పరంగా వినడానికి బాగున్నా తెర మీద అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా కథనం. సినిమా మొదట్లో వచ్చే డయానా బాల్యపు సన్నివేశాలు కేవలం డయానా చివర్లో ధరించే ఆర్మర్ ని పరిచయం చేయడానికి మరియు విజయానికి దగ్గరి దారులు వెతకవద్దనే సందేశం ఇవ్వడం కొరకు మాత్రమే ఉపయోగించుకోవడం గమనించవచ్చు. ఈ సన్నివేశాలు వండర్ ఉమన్ మొదటి చిత్రం లో చూపించినంత ఇంటరెస్టింగ్ గా ఉండకపోవడం మరియు ఒరిజినల్ కథకు ఎటువంటి న్యాయం చేయకపోవడం గమనించవచ్చు. ఇక హాన్స్ జిమ్మర్ తన సంగీతం తో నిరాశ పరచాడనే చెప్పవచ్చు. కథకు 1980 బ్యాక్ డ్రాప్ తీసుకున్నా సంగీత పరం గా, ఇతర సంఘటనలను ఆ కాలానికి అణ్వయించడంలో తడబాటు కనపడుతుంది. మొదటి భాగం లో ఎంతో స్కోప్ తో కూడిన పాత్ర కలిగిన స్టీవ్ ఈ సీక్వెల్ లో కేవలం డయానా కు ఒక సైడ్ క్యారెక్టర్ గా మాత్రమే కనిపిస్తాడు. మాక్స్వెల్ గా పెడ్రో పాస్కల్ నటన ఆకట్టుకున్నా ఆ పాత్ర కి తనంతగా కుదిరినట్టు అనిపించదు. మాండలోరియన్ గా గంభీరమయిన పాత్రలో అలరించిన పెడ్రో పాస్కల్ కామిక్ విలన్ గా అలరించలేకపోయాడు.
సినిమా నిడివి మరియు ఎడిటింగ్ ఈ సినిమా కు మైనస్ పాయింట్స్ . మొత్తం గా వండర్ ఉమన్ 1984 కేవలం యావరేజ్ సినిమాగా మాత్రమే అలరించడం గమనించవచ్చు.
Customer Reviews